వ్యవసాయ కార్పొరేటీకరణకు కుట్ర

– రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ నివేదిక ఆధారంగా జేపీసీతో దర్యాప్తు చేపట్టాలి :ఏఐకేఎస్‌ డిమాండ్‌
న్యూఢిల్లీ : భారత దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని మోడీ ప్రభుత్వాన్ని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) డిమాండ్‌ చేసింది. లేని పక్షంలో రైతాంగం నుంచి సమైక్య ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి వుంటుందని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఉన్న ప్రభుత్వ విధానాలన్నింటినీ ధ్వంసం చేసి, రైతాంగ వ్యతిరేక నిరంకుశ చట్టాలను తీసుకువచ్చేలా బడా వాణిజ్య సంస్థలు, వారికి సహకరించే ఎన్‌ఆర్‌ఐల చర్యలపై దర్యాప్తు చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలని ఏఐకేఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ నల్ల చట్టాలను నిరసిస్తూ చారిత్రకంగా 380 రోజుల పాటు సాగిన పోరాటంలో 735మంది రైతులు అమరులయ్యారని తెలిపింది. ప్రధాని మోడీ, వారి ఆశ్రిత పక్షపాతులు ఈ విషయంలో చేతులు కడిగేసుకోలేరని విమర్శించింది. భారతీయ వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడం ద్వారా రైతాంగాన్ని, వినియోగదారులను దోపిడీ చేసేందుకు మోడీ ప్రభుత్వం, నిటి ఆయోగ్‌, అదానీ నేతృత్వంలో ప్రముఖ కార్పొరేట్లు కలిసి పన్నిన నీచపుటెత్తుగడలను ఇటీవల రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ జరిపిన దర్యాప్తు బట్టబయలు చేసింది. ప్రాముఖ్యత కలిగిన ఈ జర్నలిస్టుల దర్యాప్తును ఏఐకేఎస్‌ అభినందించింది. ఈ దర్యాప్తు వివరాలను రెండు భాగాలుగా విడుదల చేశారు.
బీజేపీకి మిత్రుడు, వ్యవసాయ రంగం, అందుకు సంబంధించిన అంశాలు, రంగాల గురించి ఎలాంటి అనుభవం, నైపుణ్యం లేని, సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌ను నిర్వహించే ఎన్‌ఆర్‌ఐ వ్యాపా రవేత్త శరద్‌ మరాఠే వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ఆలోచనలను ప్రమోట్‌ చేయడంలో ఎలా కీలక వ్యక్తిగా వ్యవహ రించారో దర్యాప్తు మొదటి భాగం వివరిం చింది. మరాఠే దీనిపై ఒక కాన్పెప్ట్‌ నోట్‌ ను సమర్పించారు. దాని ప్రాతిపదికన నిటి ఆయోగ్‌ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌్‌ (ఎస్‌ టీఎఫ్‌)ను ఏర్పాటు చేసింది.. ఈ టాస్క్‌ ఫోర్స్‌కి నాయకత్వం వహించే అశోక్‌ దాల్వాయి రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే మంత్రివర్గ కమిటీకి చైర్మెన్‌గా కూడా వుండడం ఆసక్తికరమైన అంశం. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ వుంచ డంపై ఆంక్షలను ఎత్తివేసేందుకు 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వంతో గుత్తాధిపత్య సంస్థలు, ముఖ్యంగా అదానీ గ్రూపు ఎలా లాబీయింగ్‌ చేసిందో దర్యాప్తు రెండో భాగం వివరించింది.

Spread the love