‘ధరణి’..దగా..

– పరిష్కారాల కంటే వివాదాలే ఎక్కువ
– 11అంశాలు..2.65లక్షల వివాదాలు
– పరిష్కరించని రెవెన్యూ శాఖ అధికారుల తప్పులకు అన్నదాతలు బలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ధరణితో భూసమస్యలకు చెల్లుచీటీ.. పరిష్కారం. రైతులు ఏ అధికారి దగ్గరకు వెళ్లకుండానే సమస్యలు పరిష్కరించుకుంటారు’ అని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సమస్యల పరిష్కారాల కంటే వివాదాలే ఎక్కువగా ఉన్నాయి. 2,65,653 వివాదాలతో ‘ధరణి’ దడ పుట్టిస్తోంది. దద్ధరిల్లుతోంది. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి సమస్యకూ సీసీఎల్‌ఏ కార్యాలయానికి రావాలంటే భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పులను సవరించడానికి రైతుల నుంచి ఫీజులు వసూలు చేయడమంటే దగా చేయడమేనని బాధితులు మండిపడుతున్నారు.
అధికారుల తప్పులకు అన్నదాతలు బలి
ధరణి పోర్టల్‌లో 2022 ఏప్రిల్‌ 29న 11రకాల సమస్యలను పరిష్కరించడానికి, పాసుపుస్తకంలో సవరణలు చేయడానికి ఒక మాడ్యూల్‌ను రూపొందించారు. దీనిలో అధికారులు చేసిన తప్పిదాలకు అన్నదాతలు మూల్యం చెల్లించుకోవాల్సివస్తున్నది. అధికారులు చేసిన తప్పులను సవరించేందుకు రైతుల దగ్గర అదనంగా ఫీజులు వసూలు చేయడం శోచనీయమని రైతులు వాపోతున్నారు. ఈ మాడ్యూల్‌ కింద 11 రకాల సమస్యల పరిష్కారం దరఖాస్తుదారులు ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి. మీ-సేవలో అదనంగా రూ.650 వసూలు చేస్తున్నారు. దీంతోపాటు ఈ మాడ్యూల్‌ లోని అంశాలను సవరిం చాలంటే విడిగా వెయ్యి రూపాయలు చెల్లించాలి. ఎన్ని అంశాలను సవరించాలంటే అన్ని వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఈ 11 అంశాల్లో పేరు, జెండర్‌, భూమి కేటగిరి, ఆధార్‌ నెంబర్‌, భూమి పట్టా, సీలింగ్‌, భూదాన్‌, అసైన్డ్‌ వంటివి తప్పుగా నమోదైతే సరిదిద్దాలి. భూమి వర్గీకరణ(మెట్ట, మాగాణి), భూమి రకం(ఏ రకంగా సంక్రమించిందో) వివరాలు, ల్యాండ్‌ ఎంజాయిమెంట్‌ (సొంతమా? వారసత్వమా? ఎవరు అనుభవిస్తున్నారు), పరిధి దిద్దుబాటు, వాస్తవ విస్తీర్ణం కన్నా పాస్‌బుక్‌లో తప్పుగా నమోదైతే చేయడం, మిస్సింగ్‌ సర్వే నెంబర్లు, పాసుపుస్తకంలో కనిపించని సర్వే నెంబర్లు తిరిగి రాయడం వంటివాటిని సరిచేయాలి. కానీ వీటిల్లో ఏదీ సరిగ్గా జరగడంలేదు.
2,65,653వివాదాలు…
ధరణి వెబ్‌సైట్‌ అమల్లోకొచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన లోపాలన్నీ ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. ఒక వ్యక్తి మరణించినా ఆయన పేరుమీద పట్టాదారు పాసు పుస్తకం వచ్చిదంటే ధరణి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై 37,828 వివాదాలు ఉన్నాయి. పాసుపుస్తకంలో తక్కువ విస్తీర్ణం రాసినవి 45,803, ఎక్కువ విస్తీర్ణం ఉన్నట్టు రాసినవి 37,998 ఉన్నాయి. ఈ రెండు వివాదాల కారణంగా రైతుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. పట్టాదారు ఫొటో తప్పుగా ఉన్నవి 18,206, పేరు తప్పుగా ఉన్నవి 17,069 ఉన్నాయి. ఫొటో తీసేది, పేరు రాసే అధికారులు కావాలనే చేస్తున్నారనే విమర్శలూలేకపోలేదు. ఒకే ఖాతాను రెండు సార్లు రాసినవి 34,815, సర్వేనెంబర్లు తప్పుగా ఉన్నవి 12,682, అటవీశాఖతో వివాదాలున్న భూములకు పాసుపుస్తకాలు జారీచేసినవి 10,879, వ్యవసాయేతర భూములకు పాసుపుస్తకాలు ఇచ్చినవి 7,431, అమ్ముకున్న అసైన్డ్‌ భూములకు పాసుపుస్తకాలు ఇచ్చినవి 4,116 ఇలా మొత్తం 2,65,653 వివాదాలు ఉన్నాయి. ఈ 11రకాల తప్పులు చేసిన అధికారులు వాటిని సరిదిద్దేపేరుతో క్షేత్రస్థాయిలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ వివాదాలు ఉన్న భూములు ఎక్కువగా భాగం అధికారపార్టీకి చెందిన నాయకుల అధీనంలో ఉండడంతోనే వీటి జోలికి వెళ్లడానికి అధికారులు సాహసించడంలేదనే ఆరోపణలూ ఉన్నాయి.
సబ్‌కమిటీ చేసిందేమిటి?
రెవెన్యూ అధికారులు తప్పులు చేశారు కానీ వాటిని సవరించే అధికారం కలెక్టర్‌, తహశీల్దార్‌ తమకులేదనడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి ప్రభుత్వం ఆర్థిక మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి,ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సభ్యులుగా కేబినెట్‌ సబ్‌కమిటీ వేసింది. ఈ కమిటీ నాలుగు సార్లు సమావేశమైనా సమస్యలు పరిష్కారం కాలేదు. కొన్ని సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రజలను విచారించిన కమిటీ 20రకాల లోపాలను గుర్తించింది.
వీటిని ఏడు మాడ్యూల్స్‌గా విభజించింది. పట్టాదారు పేరు, వివరాలు సరిచేయడం, మిస్సింగ్‌ సర్వే నెంబర్లను సరిచేయడం తదితర అంశాలను సరిచేయడానికి కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని సబ్‌కమిటీ సిఫార్సు చేసింది. మిస్సింగ్‌ సర్వే నెంబర్లకు సంబంధించి 34,666 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఈ అంశానికి ప్రత్యేక మాడ్యూల్‌ రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. భూ విస్తీర్ణం సరిచేయడానికి 16వేల ఫిర్యాదులు వచ్చాయి. బదిలీ నిషేధిత భూముల జాబితాలో పొరపాటుగా చేర్చిన సర్వేనెంబర్లకు సంబంధించి 1,00,902 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 84,949దరఖాస్తులను కలెక్టర్లు సవరిం చారు. 15,953 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. సబ్‌కమిటీ చేసిన సిఫార్సులేవీ సరిగ్గా అమలుకు నోచుకోకపోవడంతో సమస్యలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉన్నాయని రెవెన్యూ రంగ నిపుణులు చెబుతున్నారు.

Spread the love