”విచ్ఛిన్నమవుతున్న ఉమ్మడి కుటుంబాలు”

''విచ్ఛిన్నమవుతున్న ఉమ్మడి కుటుంబాలు''కుటుంబ వ్యవస్థ మన సమాజం మనకు ఇచ్చిన ఒక గొప్ప అరుదైన కానుకగా భావించవచ్చు.కుటుంబం అనేది సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ ప్రత్యేకత కారణంగా, కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేస్తూ వసుధైక కుటంబము అనే దిశలో ప్రయాణానికి తోడ్పడుతున్నది.సామాజిక, ఆర్థిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్చే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది.కుటుంబ వ్యవస్థ వల్ల సమాజానికి మనం ఇచ్చే సందేశం ఎంతో గొప్పది.ప్రపంచదేశాల్లో భారతదేశ కుటుంబ వ్యవస్థలా మరెక్కడా లేకపోవడం అనేది కూడా మన గొప్పతనంగా భావించవచ్చు.ఉమ్మడి కుటుంబం, చిన్న కుటుంబం గురించి చర్చిస్తున్నప్పుడు రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం.పవిత్ర భారతదేశానికి సాంస్కృతిక వారసత్వానికి ,అత్యుత్తమ విధానమైన మన ”కుటుంబ వ్యవస్థ” గురించి ఎంత గొప్పగా చెప్పినా కుడా తక్కువే.అయినప్పటికీ అక్కడక్కడ కుటుంబాలు విచ్చిన్నమవుతున్నట్లు కనిపిస్తోంది. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థలో ఏండ్లుగా చాలా మార్పులు వచ్చాయి.గత రెండు దశాబ్దాలుగా చూస్తే అనేక పాత ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోవడానికి ఇష్టపడుచున్నాయని విషయం అర్థం అవుతుంది.ఇది కొంత విచారకరం.
కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి కారణాలలెన్ని ఉన్నప్పటికీ ముఖ్య కారణం స్వార్థం, స్వార్థ పూరితమైన ఆలోచనలు, విపరీతమైన వింత ప్రవర్తన, అదుపులేని అనుచుకొని కోరికలు, దురాశ, ఒత్తిడి, స్వేచ్చను కోరుకోవడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం,పెద్దల జోక్యం అంగీకరించక పోవడం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇలాంటి కారణాలవల్ల మన ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. అతిచిన్న వయసులోనే పిల్లలను హాస్టల్‌లో వదిలిపెట్టే ధోరణి పెరిగి పోవడం వల్ల, పెద్దలతో కలిసి లేకపోవడం, వారితో సాన్నిహిత్యాన్ని పెంచలేకపోవడంతో పెద్ద కుటుంబం విలువ తెలియడం లేదు. కుటుంబం నుంచి సరియైన సంబంధాలు లేక పోవడం వల్ల భద్రత కరువై విడాకులు తీసుకోవడానికి ఈనాటి యువత సిద్ధంగా ఉందంటే వారి ఆలోచన విధానం ఎలా ఉందో తెలుస్తోంది. వారికున్న కారణాలతో విడిపోవడం వల్ల సమాజములో ఒంటరితనం పెరిగిపోతోంది. దీని కారణంగా మత్తు పదార్థాలకు అలవాటు పడడం, హింస, నేరాలు, పెద్దలంటే గౌరవం లేకపోవడం లాంటి అంశాలు పెరిగి ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నాయి. కుటుంబ పెద్దలకు,వయస్సు మళ్ళిన వారికి రక్షణ లేక పిల్లలు విదేశాల్లో ఉండడం వల్ల వఅద్ధాశ్రమాలలో చేరుచున్న వారి సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది.మన కుటుంబ వ్యవస్థలో చైతన్యవంతమైన, విలువలతో కూడిన ప్రవఅత్తిని కాపాడేందుకు సమగ్రమైన, పటిష్టమైన ప్రయత్నం జరగాలని,అందుకు రోజువారీ ప్రవర్తన, నడవడిక ద్వారా మన కుటుంబ జీవనం వ్యక్తిత్వాన్ని, జీవన విలువలను పెంపొందించి, వరస్పర సంబంధాలను పటిష్ట పరచేలా చూసుకోవాలి.
సామూహిక సమ్మేళనాలు,ఆత్మీయ సమ్మేళనాలు,సహపంక్తి భోజనాలు, పండుగలు, తీర్థయాత్రల ద్వారానూ, మాతృభాష వాడకం, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం, కుటుంబ సామాజిక సంప్రదాయాలను కాపాడడం ద్వారా కుటుంబ జీవనం మనకు ఆనందాన్ని ఇస్తుంది.ప్రతి ఒక్కరినీ సామాజిక బాధ్యత ఉండేలా ప్రేరేపించడం, సామాజిక, ధార్మిక, విద్యా కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చేలా ప్రోత్సహించడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం, ఖాళీ సమయాల్లో అందరూ కలిసి మనసులో మాటలు పంచుకోవడం లాంటి అంశాలు కుటుంబ వ్యవస్థ ప్రవృత్తిగా మారాలి.ఇంట్లో మన బాగోగులు,ఇష్టమైన ఆహారం చూసే భాధ్యత తల్లిది.మన కుటుంబ వ్యవస్థకు కీలకం తల్లే,కాబట్టి మాతృశక్తిని మరియు మహిళా శక్తిని గౌరవించడం, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ద చూపెట్టడం ప్రతి కుటుంబ సభ్యుడికి నేర్పించాలి. సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవడం కుటుంబంలో అలవాటు కావాలి.ప్రతి కుటుంబ సభ్యుడు హక్కులు కాక బాధ్యతలు,విధులు ప్రాధాన్యంగా భావించి కుటుంబములో చర్చలు జరగాలి. మన విధులను మనం నిర్వర్తిస్తేనే ఇతరుల హక్కులను గుర్తించగలం.కాబట్టి చర్చలో పాల్గొని,పెద్దల మాటలు,వారి అనుభవంలోని మంచిని గ్రహించేలా చూడాలి.
కాలం గడుస్తున్న కొద్ది మన సమాజంలోకి కొన్ని అననుకూల పరిస్థితులు, కొంత ప్రతికూలత వచ్చి చేరింది. వరకట్నం, అంటరానితనం, దుబారా ఖర్చు, మూడనమ్మకాలు మొదలైనవి మన సమాజం అభివృద్ధికి అప్పుడప్పుడు ఆటంకంగా మారుచున్నాయి.ఇలాంటి సందర్భములో కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల సామాజిక లాభం జరగవచ్చు.సమాజానికి విలువలు నేర్పడంలో ”ఎలక్ట్రానిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా” మంచి సాధనాలు.కుటుంబ వ్యవస్థ గురించి మంచి కథనాలు ప్రచురించడం, అలాగే స్ఫూర్తిదాయకంగా చిత్రాలు తీయడం,ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం,చట్టాల రూపకల్పన చేసేటప్పుడు ప్రభుత్వాలు కుటుంబ వ్యవస్థ పటిష్టపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంతైనా మార్పు వస్తుంది.
తప్పని పరిస్థితుల కారణంగా చిన్న కుటుంబాల్లో ఉండేవారు కూడా తమ పూర్వీకుల కుటుంబంలోని అందరితో సంబంధాలు పెట్టుకుని, వీలైనప్పుడు జిల్లా ఉమ్మడిగా వారితో సమయం గడపి, పూర్వీకుల స్థలంతో సంబంధం కలిగిఉండేలా చూసుకోడం వల్ల బంధాలు బంధుత్వాలు బలపడే అవకాశం ఉంది. అంటే మన మూలాలను మరవకుండా, కుటుంబంగా అందరం కలిసి సామూహిక కార్యక్రమాలు నిర్వహించడం కొంత తోడ్పడుతుంది. కుటుంబ సామాజిక బంధాలను పెంచేది పిల్లలు. పిల్లల ప్రాథమిక విద్య స్థానిక ప్రాంతంలో పూర్తిచేయడం, మన పరిసర ప్రాంతాల్లో పండుగల, జాతరలు, సమిష్టి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల, అందులో చురుకుగా పాల్గోవడం వల్ల పిల్లలకి కూడా పెద్ద కుటుంబంలో భాగం అన్న భావన కలుగుతుంది. గౌరవం,త్యాగం, సంయమనం, ప్రేమ, ఆత్మీయత, ఓర్పు, ఒకరికొకరు సహకరించుకోడం, సంతోషకరమైన ఉమ్మడి కుటుంబానికి మార్గాలుగా భావించి ఈ లక్షణాలను కుటుంబ సభ్యులందరు కలిగివుండేలా కృషిచేస్తే, ఆనంద జీవనం అందించవచ్చు.అత్యంత విలువైన కుటుంబ వ్యవస్థను మరింత విలువలతో కూడుకున్న చైతన్యవంతమైన ముందు తరాలకు అందించేలా కృషిచేసే భాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది.
గడప రఘుపతిరావు
9963499282

Spread the love