తెలంగాణ సమాజాన్ని అద్దంలో చూపిన ‘ఐదు తరాలు’

–  ఆ పుస్తకం ముందు తరాలకు స్పూర్తి
– మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘ఐదు తరాల పుస్తకం..తెలంగాణ సమాజాన్ని అద్దంలో చూపించింది. ఈ పుస్తకం ముందు తరాలకు స్ఫూర్తి’ అని మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా అదనపుకలెక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ‘ఐదు తరాలు’ పుస్తకాన్ని నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషలో సహజత్వం రచయితకే సాధ్యమని అన్నారు. సాహిత్యం పరంగానే కాకుండా చరిత్రకు సంబంధించిన రెపరెన్స్‌గానూ ఈ పుస్తకం ఉపయోగపడుతుందని తెలిపారు. పాతకాలంలో జరిగిన సంఘటనలను కండ్లకు కట్టినట్టు రచయిత వివరించారని తెలిపారు.
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ ‘ఈ పుస్తకం మా నాయిన పరకాయ ప్రవేశం చేసి రాసినట్టుగానే అనిపించింది. సహజత్వాన్ని గుర్తు చేస్తున్నది’ అని అన్నారు. గతంలో తెలంగాణ భాష, యాస, మాండలికమంటేనే నవ్వుకునేవారనీ, నేడా పరిస్థితి లేదని చెప్పారు. జమీందార్ల కులంలో పుట్టి పేదవారి కోసం పనిచేయడంతోపాటు పేదలకు సంబంధించిన వెయ్యి కేసులను వాదించి గెలిపించిన ఘనత రచయిత మల్లారెడ్డికే దక్కుతుందన్నారు. సమసమాజం కోసం పోరాడి ప్రాణాలర్పించిన వ్యక్తి జార్జిరెడ్డి అని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.
వేమన, బసవేశ్వరుడు లాంటి ఎంతో మంది సమాజం కోసం పనిచేశారని తెలిపారు. ఒక సిద్ధాంతం కోసం అడవిలో అన్నలు పోరాడుతుంటే ఓ పత్రిక కండోమ్‌ ల గురించి వార్త రాసి ఆ ఉద్యమాన్ని కించపర్చిందని, ఇది తగదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయి త్యాలు, దోపిడీలు, దౌర్జన్యాలను అడ్డుకోవడానికి పిడికిలెత్తా ల్సిందేనని అన్నారు. తెలంగాణ రాకముందు కరెంట్‌ లేక పాముకాట్లతో, కరెంట్‌ షాకులతో, పోలీసుల కూంబింగ్‌లో అనేక మంది రైతులు మరణించారని తెలిపారు. కేసీఆర్‌ పాలనలో 24గంటల కరెంట్‌తో ఆ బాధల్లేవని గుర్తు చేశారు.తాగునీటి కోసం బిందెల కొట్లాటలేదని చెప్పారు. రాపోలు సుదర్శన మాట్లాడుతూ ఈ పుస్తకం సేవా పరిమళాలు వెదజల్లే గులాబీ..ఎర్ర గులాబీ అని అన్నారు. ఇది పక్కా చరిత్ర పుస్తకమేనని కొనియాడారు. అందులో మూలవాసుల కథ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. రచయిత వేముల ప్రభాకర్‌ మాట్లాడుతూ అధికార పీఠంలో సాహిత్య ఏనుగు అని నరసింహారెడ్డిని ప్రశంసించారు. మల్లారెడ్డికి నక్సలైట్లు, పేదల లాయర్‌ అని పేరుందని గుర్తుచేశారు.
రచయిత అన్నవరం దేవేందర్‌ మాట్లాడుతూ రూ.100కోట్ల విలువైన భూములను కాపాడిన ఘనత లాయర్‌ మల్లారెడ్డికే దక్కుతుందని అన్నారు. ఆయన చరిత్రను సినిమా రూపంలో తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు.
రచయిత గుడిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమ్మ నవల తెలుగులో వచ్చింది కానీ, తెలంగాణ భాషలో కూడా వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.కవిత్వం, కవితలను సిలబస్‌లో చేర్చాలని కోరారు. పుస్తక రచయిత గులాబీల మల్లారెడ్డి మాట్లాడుతూ లాయర్‌గాను, సర్పంచ్‌గాను, రచయితగాను ప్రజలకు ఎంతో సేవా చేశానని అన్నారు. దోపిడీ, అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించానని తెలిపారు. అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి నేదుమల్లి జనార్దన్‌రెడ్డితో మాట్లాడి రూ.100కోట్ల విలువైన భూములను పేదలకు ఇప్పించానని గుర్తుచేశారు.
అనంతరం పుస్తక రచయిత ఆధ్వర్యంలో అతిథులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెహమన్‌, ఆవంచ ప్రమోద్‌, కూర చిదంబరం, రాజశేఖర్‌, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love