ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం

– కార్మిక చట్టాలను కాపాడుకుందాం
– బీజేపీని ఓడిద్దాం : ఏఐటీయూసీ

నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌ మెట్‌
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం..లౌకిక పార్టీలకు ఓటేద్దాం అని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి అన్నారు. పెద్ద అంబర్‌ పేట మున్సిపల్‌ , రావి నారాయణరెడ్డి కాలనీలో మే డే 138వ ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీర్‌ హరిసింగ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి హాజరై మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధన కోసం భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వమే ఏఐటీయూసీ ఆవిర్భవించిందని, బాలగంగాధర్‌ తిలక్‌, జవహర్‌ లాల్‌ నెహ్రూ మొదలగు గొప్ప నాయకులతో ఏఐటీయూసీ సంఘం ముందుకు సాగిందని గుర్తుచేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎంతోమంది కార్మికులు తమ రక్తం బొట్టును చిందిస్తూ ప్రాణ త్యాగాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందని వివరించారు. నాటి నుంచి నేటి వరకు కార్మికుల పక్షాన నిరంతరాయంగా ఉద్యమ బాట పడుతూ కార్మికుల సమస్యలపై గొంతెత్తి ప్రజా ఉద్యమాలను ఏఐటీయూసీ చేపడుతుందన్నారు. పారిశ్రామిక రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ ప్రజా ఉద్యమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. దేశంలో మతోన్మాదం పెచ్చు మీరుతుందని, బీజేపీ ప్రభుత్వం మతం ముసుగులో మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అందుకే కార్మికులు, కర్షకులు సంఘటిత, అసంఘటిత కార్మికులు, ప్రజలు ఒకే గొంతుకై బీజేపీని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా సంఘటితమై లౌకిక పార్టీలకు ఓటేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి అమనగంటి వెంకన్న, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల అధ్యక్షుడు దాసరి ప్రసాద్‌, రాములు, ఆటో యూనియన్‌ నాయకులు ఈశ్వరయ్య, నాయకులు నారాయణరెడ్డి, చిలుకూరి పుల్లయ్య, ధూపం నిరంజన్‌, బట్టల అనసూయ, బిక్షం నాయక్‌, వీరన్న, వినోద్‌ నాయక్‌, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love