ఓయూ మైనింగ్‌ ఇంజినీరింగ్‌కు మహర్దశ

రెండు అరుదైన చైర్స్‌ను సొంతం చేసుకున్న విభాగం
– ప్రతిష్టాత్మకంగా ఆర్థిక పరిపుష్టి
– సింగరేణి సీఎండీ చేయూత, పూర్వ విద్యార్థుల ఆపన్న హస్తం
– మొన్న కోల్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్‌, నిన్న సింగరేణి కాలరీస్‌ చైర్‌
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల దినదినాభివద్ధి చెందుతోంది. ఇటీవలే కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొ.శ్రీరాం వెంకటేష్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత అల్యుమినీ అసోసియేషన్‌ సహకారంతో ప్రగతిలో ముందుకు పోవడంతో పాటుగా, పలు మైలు రాళ్లు అధిగమించింది. ఆరు నెలల వ్యవధిలో జాతీయ స్థాయిలో రెండు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఒకే విభాగానికి రెండు చైర్స్‌ ప్రదానం చేయడం విశేషం. ఇటు మైనింగ్‌ పూర్వ విద్యార్థుల కృషి.. నాటి మాజీ వీసీ, నేటి వీసీ, ప్రిన్సిపాల్‌ కృషితోనే ఇది సాధ్యమైందని ప్రొఫెసర్స్‌, విద్యార్థులు, ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రూ.3 కోట్లతో కోల్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్‌ ప్రదానం
ఈ ఏడాది మార్చి 27న కోల్‌ ఇండియా లిమిటెడ్‌ వారు ఓయూ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ప్రొఫెసర్‌ చైర్‌ కింద రూ.మూడు కోట్లు అందజేశారు. ఆ మూడు కోట్లతో వచ్చిన వడ్డీతో విభాగంలో ప్రొఫెసర్స్‌ను నియమిస్తారు. దాంతో బోధన, పరిశోధన జరుగుతుంది. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. గైడ్స్‌గా (పర్యవేక్షకులు)గా వ్యవహరించనున్నారు. దీని ద్వారా కళాశాల ఉన్నతికి తోడ్పాటు ఇస్తారు. ఈ చైర్‌ కింద ప్రొఫెసర్లను కమిటీ ద్వారా నియమిస్తారు. ఇక మైనింగ్‌ విభాగంలో త్వరలోనే పీహెచ్‌డీ ప్రోగ్రాం కూడా అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓయూ అధికారులకు దీనిపై లేఖ రాశారు.
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) చైర్‌, పీఓపీ
సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి గత బుధవారం సీఎండీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో సింగరేణి చైర్‌ కింద రూ.మూడు కోట్లు అందించారు. ఓయూ ఇంజి నీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, మైనింగ్‌ విభాగం హెడ్‌ ప్రొ.శ్రీరాం వెంకటేష్‌ సమక్షంలో రూ.మూడు కోట్లతో పాటు ‘ప్రొపెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీసు(పీఓపీ)’ స్కీమ్‌ కింద యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఇద్దరు సింగరేణి కాలరీస్‌ ఉద్యోగులను ఓయూ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అధ్యాపకులుగా నియమించారు. ఇద్దరు అధ్యాపకులకు మూడేండ్ల పాటు వేతనాలు సింగరేణి కాలరీస్‌యే ఇస్తుంది. పీఓపీ ద్వారా సదరు అధ్యాపకులు వివిధ పరిశ్రమల నుంచి వర్సిటీకి మధ్య ఉన్న గ్యాప్‌ను పూరిస్తూ, పరిశ్రమలకు అవసర మైన విధంగా మైనింగ్‌ విద్యార్థు లకు బోధన శిక్షణ ఇస్తారు. దీంతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయి. అలాగే వర్సిటీకి ఆర్థిక భారం తగ్గి ఫ్యాకల్టీ కొరత తీరుతుంది. యూనివర్సిటీకి ఇటు యూజీసీ అటు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ ఉత్తమ గ్రేడ్స్‌ రావడానికి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు సింగరేణి ఇటీవల ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ (ఈసీఈ) విభాగంలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఐఆర్‌) కింద రూ. రెండు కోట్లు మంజూరు చేసింది.
కీలక బాధ్యతల్లో ఓయూ పూర్వ విద్యార్థులు
33ఏండ్ల కిందట ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక బాధ్యతల్లో ఉన్నారు.
సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌, ఎన్‌యండీసీతో పాటుగా పలు మైనింగ్‌ కంపెనీలలో ఉన్నత స్థాయి బాధ్యతల్లో ఉన్నారు. వీరు చొరవ తీసుకుని ఓయూలో 2018 -2019 విద్యా సంవత్సరంలో ఎంఈ మైనింగ్‌ కోర్సును తిరిగి ప్రారంభించారు. దీనిని సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఎటాచ్‌ చేశారు.
ఇక 2021 – 2022 సంవత్సరంలో యూజీ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి యూజీ రెండో సంవత్సరం నడుస్తోంది. మైనింగ్‌ విభాగాన్ని తిరిగి తీసుకురావడంలో పూర్వ విద్యార్థులు విశేష కృషి చేశారు. ఈ విభాగానికి నెలల వ్యవధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అయిన రెండు చైర్‌ ప్రొఫెసర్స్‌ తీసుకురావడంలోనూ పాటుపడ్డారు.
వర్సిటీ కీర్తి ప్రతిష్టలు పెరిగాయి
మైనింగ్‌ విభాగానికి ఒకేసారి రెండు చైర్స్‌తో పాటు పీఓపీ ఇచ్చిన సింగరేణి, కోల్‌ ఇండియా సంస్థలకు, అందుకు కృషి చేసిన అల్యుమినీకి, వీసీ, మాజీ వీసీలకు ధన్యవాదాలు. ఇది సమిష్టి కృషి. వీటితో వర్సిటీ కీర్తి ప్రతిష్టలు పెరిగి పలు ర్యాంకింగులతో మరింతగా ముందుకు పోతుంది.
– ప్రొ.శ్రీరాం వెంకటేష్‌, ప్రిన్సిపాల్‌.
రీసెర్చ్‌ పెరుగుతుంది
అత్యున్నత గుర్తింపు ఉన్న పరిశ్రమలు ఓయూకు వస్తాయి. దీంతో పరిశ్రమల నుంచి ప్రాజెక్ట్స్‌ ఇస్తారు. రీసెర్చ్‌ అభివృద్ధి చెందుతుంది. వర్సిటీ పేరు ప్రఖ్యాతలు మరింతగా పెరుగుతాయి.
– డా.విజయ్ దేవరకొండ,ఇంజినీరింగ్‌ కళాశాల అల్యుమిని అధ్యక్షుడు

Spread the love