మివీ బ్రాండ్‌ మిధుల

అనుకున్నది సాధించే శక్తి సామర్థ్యాలు ఆమె సొంతం. చిన్ననాటి నుంచి చదువులో రాణించారు. గొప్ప క్లాసికల్‌ డ్యాన్సర్‌ పేరు తెచ్చుకొని కళలోనూ తానేంటో నిరూపించుకున్నారు. మొత్తానికి ఆమె గెలుపుకి కేరాఫ్‌ అడ్రస్‌. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనటానికి చక్కటి ఉదాహరణ. విదేశాల్లో మంచి ఉద్యోగాన్ని విడిచి స్వదేశంలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించారు. అలుపెరుగని కృషి, పట్టుదల, నైపుణ్యం, క్రమశిక్షణతో పారిశ్రామిక రంగంలో విజయాలు సాధిస్తున్నారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆమే ప్రముఖ పారిశ్రామికవేత్త
మిధుల దేవభక్తుని…
మిధుల ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించారు. ఆమెకు చెల్లి, సోదరుడు ఉన్నారు. చిన్నతనం నుంచే ప్రతీది నేర్చుకోవాలి, సాధించాలనే పట్టుదల. రెండేండ్ల వయసులోనే క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకునేందుకు పక్కింటికి వెళ్లేవారు. 8వ తరగతి నాటికే భవిష్యత్తుపై ఒక స్పష్టత వచ్చేసింది. ఇదే ఆమెను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్శిటీ నుండి కంప్యూటర్‌ సైన్స్‌, ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్శిటీ నుండి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ చేసే వరకు తీసుకువెళ్లింది. డ్యాన్స్‌లో డిప్లొమా కూడా చేసారు.
సవాళ్ళను స్వీకరిస్తూ…
ఆమె అసాధారణ ప్రయాణంలో అభిరుచి ప్రధానమైనది. మిధుల ఎప్పుడూ కంప్యూటర్‌ సైన్స్‌లో కొత్త ఆవిష్కరణలతో నిమగమై ఉంటారు. సవాళ్ళను స్వీకరిస్తూ అభివృద్ధి చెందుతున్నారు. వ్యాపారం ప్రారంభించక ముందు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో మంచి జీతంతో అనేక ఉద్యోగాలు చేశారు. అయితే భారతదేశంలో ఎలక్ట్రానిక్‌ రంగంలో ఖాళీని పూరించడానికి రిస్క్‌ తీసుకున్నారు. 8 నెలల R&D తర్వాత, Mivi ప్రారంభించారు. ‘వ్యాపారంపై మక్కువ లేకపోతే మార్కెట్‌లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఏ పనైనా చేసే ముందు, ఆ పని పట్ల ఇష్టం ఉండాలి’ అంటారు మిధుల.
చురుకైన ఆలోచనలతో…
మిధుల ప్రస్తుతం మివీలో చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌, కో-ఫౌండర్‌. ఆమే దీన్ని నడిపిస్తున్నారు, నిర్వహిస్తున్నారు. 2008లో ఆంధ్రప్రదేశ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్శిటీ నుండి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ ని అభ్యసించడానికి యునైటెడ్‌ స్టేట్స్‌కు వెళ్లారు. ఆ తర్వాత అదే యూని వర్సిటీలో ఎంబీఏ చేశారు. సృజ నాత్మక, ఆచరణాత్మకమైన చురు కైన ఆలోచనతో సమస్యలను సులభంగా పరిష్కరించడం ఆమె ప్రత్యేకం.
ప్రజలు మద్దతు ఇచ్చారు
మొదట 2011లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారం భించారు. ఉద్యోగాన్ని వదులుకొని 2015లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అక్టోబర్‌ 2015లో భర్త విశ్వనాధ్‌తో కలిసి మివీకి పునాది వేశారు. ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో భార తీయ మార్కెట్‌కు నాణ్యమైన ఉత్ప త్తులను పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘సంతోషకరమైన కస్టమర్‌ కంటే మీ ఉత్పత్తిని ఎవరూ బాగా ప్రచారం చేయలేరు’ అంటారు ఆమె. అంతర్జాతీయ బ్రాండ్‌ కంటే మెరుగ్గా, దృఢంగా ఉండే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు స్థానికంగా నిర్మించగలమని నిరూ పించారు. ప్రజలు కూడా తమకు మద్దతు ఇచ్చారని, రాబోయే కొన్నేండ్లలో దేశంలో ఎలక్ట్రానిక్స్‌ రూపురేఖలు మారబోతున్నాయని ఆమె చెపుతారు.
అభివృద్ధి బాటలో…
బ్లూటూత్‌, హెడ్‌ఫోన్‌లు, TWS ఇయర్‌బడ్‌లు మొదలైన ఆడియో ఉత్పత్తుల తయారీని ప్రారంభించి, మొదటి భారతీయ కంపెనీలలో హైదరాబాద్‌ ఆధారిత యాక్సెసరీస్‌ బ్రాండ్‌లో మివీ ఒకటిగా నిలిచింది. వీటితో పాటు మివీ భారతదేశంలో ధరించగలిగిన వస్తువుల మార్కెట్‌లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది. భారతదేశంలో కూడా స్మార్ట్‌వాచ్‌ లను తయారు చేస్తే కొద్దిమందిలో ఒకటిగా ఉంటుంది. ”మేము భారతదేశంలో ఉత్పత్తులను తయారు చేయాలని అనుకు న్నపుడు అందరూ మమ్మల్ని పిచ్చివాళ్లమకున్నారు. నిజానికి విశ్వనాధ్‌కి పిచ్చెక్కించిన మొదటి వ్యక్తి నేనే. కానీ త్వరలోనే గొప్ప స్థాయికి వెళుతుందని తేలింది” అమె అంటున్నారు.
80 శాతం మహిళలే…
ఐదేండ్ల కిందట రోజుకు 20-30 ఆర్డర్‌లను పొందిన మివీ ఇప్పుడు దేశంలోని ఆడియో విభాగంలో ప్రముఖ ప్లేయర్‌గా మారింది. హైదరాబాద్‌లోని ఎంఐవీఐ ప్లాంట్‌ (అవిష్కరణ్‌ ఇండిస్టీస్‌)లో 1500 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో 80శాతం మంది మహిళలే. మివీ భారతదేశం అంతటా టైర్‌ 1 నుండి టైర్‌ 2, టైర్‌ 3 నగరాలకు తన ఉనికిని విస్తరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. 2015 నుంచి పక్కా ప్రణాళిక, రూపకల్పనతో మా బ్రాండ్‌ అభివృద్ధి చెందుతూనే ఉంది. దేశంలో అత్యంత తక్కువ ధరలకు అత్యుత్తమ నాణ్యతను అందించడం మా విజయ రహస్యం. 15 ఉత్పాదక మార్గాలు, 1500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో మివీ నేడు రోజుకు 40,000 కంటే ఎక్కువ ఉత్పత్తులను తయారు చేస్తుంది.
వైవిధ్యాన్ని సృష్టించాలని…
‘బ్రాండ్‌ ప్రారంభమైన ఆరేండ్లలో భారతదేశ స్వదేశీ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ మివీ దేశంలో TWS పరిశ్రమలో 6.7 శాతం మార్కెట్‌ వాటాతో దేశంలోని ప్రముఖ TWS (నిజమైన వైర్‌లెస్‌ స్టీరియో ఇయర్‌బడ్స్‌) బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. కంపెనీ ఇటీవలే స్మార్ట్‌ వేరబుల్స్‌ కేటగిరీలోకి ప్రవేశించింది. గేమింగ్‌ కేటగిరీలోకి ప్రవేశించే ప్రణాళిక కూడా ఉంది’ అంటారు మిధుల. అలాగే హైదరాబాద్‌లోని దాని తయారీ యూనిట్‌ నుండి వచ్చే అధిక నాణ్యత ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ ఉత్పత్తులను పరిచయం చేస్తూ, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ల పరిశ్రమలో బ్రాండ్‌ ఎలా వైవిధ్యాన్ని సృష్టించాలని కోరుకుంటుందో ఆమె చెప్పారు. తమ తయారీ సామర్థ్యాన్ని పది రెట్లు పెంచాలని, 2023 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 3,000 మందికి రెట్టింపు చేయాలని ఆమె యోచిస్తున్నారు. మొదటి ఏడాదిలో మివీ సుమారు 8 కోట్ల వ్యాపారం చేసింది. ప్రస్తుతం విజయాల బాటలో నడుస్తుంది.
మహిళా ఉద్యోగులతో సఖ్యత
మిధుల తన కార్యాలయంలోని సిబ్బంది యోగ క్షేమాలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఇక మహిళా ఉద్యోగులను ఎంతో ఆదరిస్తారు. మహిళలను గౌరవిస్తూ, ప్రోత్సాహిస్తారు. ‘నేను మా అమ్మను మాత్రమే కాకుండా, అమ్మమ్మ, అత్తమామలు, వివిధ రంగాల్లో ఎంతో కష్టపడి బాధ్యతలను నిర్వహించే స్త్రీ మూర్తులకు, మరెన్నో అద్భుతాలు సృష్టించే గృహిణులకు, వారి కుటుంబాల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న వారిని గౌరవిస్తాను. ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నాను’ అంటూ మహిళల పట్ల తన విధేయతను చూపిస్తారు.
– ములుగు లక్ష్మీమైథిలి

 9440088482

Spread the love