నేలమ్మ

Earth Day - palaparthi sandhyarani‘మానవులారా శిలాజ ఇంధనాలను మండించకండి. మనల్ని మనం చంపుకుంటూ భూమిని చంపొద్దు. ఉత్తుత్తి ప్రేమ వచనాలు వద్దు. ఆచరణలో చూపిద్దాం. దాని వల్ల మనం కోల్పోయేది ఏమీ ఉండదు మన పిసినారితనం తప్ప’ అంటారు ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త పీటర్‌ కల్మస్‌. భూమి లేకపోతే మనం ఎక్కడీ ఈ ప్రకృతే మన ఇల్లు. దీన్ని మనమే రక్షించుకోవాలి. ఈ భూగోళం మనకు వారసత్వంగా రాలేదు. దీన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. అంతే కదా… మనం ఆరోగ్యంగా ఉండాలంటే… నేల కూడా ఆరోగ్యంగా ఉండాలి. భూమి ఎంత సార వంతంగా ఉంటే అంత మంచి ఆహారం మనకు అందుతుంది. ఆహార పదార్థాల్లో పోషక విలువలు ఉండటం లేదంటే అందుకు కారణం నేల సారం కోల్పోవటమే. అందుకే…అన్నం పెట్టే నేల తల్లిని కాపాడుకోవాలసిన బాధ్యత మనందరిపై ఉంది. వజ్రాలకు ఎందుకు అంత విలువ? ఎందుకంటే అవి అరుదుగా ఉంటాయి కాబట్టి. మరి కొన్ని లక్షల సంఖ్యలో ఉండే వజ్రాలకే అంత విలువ ఉన్నప్పుడు ఈ విశ్వంలో జీవులున్న ఏకైక గ్రహంగా చెప్పుకుంటున్న భూమి ఇంకెంత విలువైనది అయివుండాలి? అసలు భూమికి మనం విలువ కట్టలేం. భూమాతకు మనం ఏం చేసినా రుణం తీరదు. అలాంటిది ప్రకృతిలో పుట్టే మనం ప్రకృతిని ఎంతో హాని చేస్తున్నాం. నేలమ్మ ప్రాధాన్యతను గుర్తించలేకపోతున్నాం. ఎన్నో రకాలుగా ప్రకృతిని హింసిస్తున్నాం. మన వల్ల నానాటికీ పెరుగుతున్న కాలుష్యమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు మన పూర్వీకులు పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళం. పంటలు పండించుకుని ఎలాంటి పురుగుమందులు వాడకుండా ఆర్గానిక్‌ ఫుడ్‌ని తినేవాళ్ళం. అందుకే మన తాతలు, బామ్మలు 90 ఏండ్లు వచ్చినా కూడా నడుములు ఒంగకుండా, కళ్ళజోడులు పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటు ఎంతో ఉత్సాహంగా కాలం గడిపారు. ఒక్క మందుబిళ్ల కూడా వేసుకోకుండా ఏండ్లకేండ్లు బతికారు. కానీ నేటి తరం మారింది. గడిచిన ఈ ముఫ్పై ఏండ్లలో పంటలు, పొలాలు, రైతులు, ప్రజలు, తిండి, తిప్పలు, విధానాలు, రోగాలు ఇలా అన్నిట్లో భయంకరమైన మార్పులు వచ్చాయి. ఆర్గానిక్‌ ఫుడ్‌ కాస్తా పోయి విషం తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పుట్టిన వాళ్లకు చూపు లేకుండా, క్యాన్సర్స్‌తో, రకరకాల స్కిన్‌ ఇన్ఫెక్షన్స్‌తో బతుకుతున్నారు చాలా మంది. ఇలాగే ఇంకొన్నేండ్లు ఉంటే మనుషుల మీద కొత్త కొత్త రోగాలు దాడి చేసి మరణాల రేటు పెరిగిపోయే అవకాశం చాలా కనిపిస్తోంది.
ఈ సమస్యలకు పరిష్కారం దొరకాలంటే నేలమ్మను కాపాడుకోవడమే మనముందున్న తక్షణ కర్తవ్యం. భూమిని కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలు అత్యవరమని గుర్తించాలి. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించి భూమి పొరల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ తగ్గించి సముద్ర జలాలు అమ్లీకరణ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. ఏది ఏమైనా భూమి ఒక్కటే ప్రాణికోటికి ఉన్న ఒకే ఒక గ్రహం అనేది మరిచిపోవద్దు. ప్రతి దేశం, ప్రతి ప్రభుత్వం, ప్రతి పౌరుడు ఈ భూమి మన అందరిది అని భావించాలి. దీన్ని అందరూ కలిసికట్టుగా కాపాడుకోవాలనే గట్టి సంకల్పంతో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి, అవసరమైతే కొత్త చట్టాలను చేసి వాటి అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలి. పర్యావరణ వేత్తలు, సామాజిక వేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు భూ గ్రహానికి భవిష్యత్తులో సంభవించే విపత్తుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి జరగబోయే ప్రమాదాన్ని నిలువరించాలి.

Spread the love