వందరోజుల మా పాలన సంతృప్తినిచ్చింది : రేవంత్ రెడ్డి

నవతెలంగాణ హైదరాబాద్‌: ‘మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని.. ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. ‘‘గత పదేండ్ల పాలనలో వందేండ్ల విధ్వంసం కేసీఆర్‌ ప్రభుత్వం చేసింది. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి తోసేసింది. గతంలో సీఎం దర్శనమే  మహాభాగ్యం అన్నట్టు ఉండేది. మా వంద రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చింది. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశాం. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల పథకాన్ని ప్రారంభించాం. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీని అవినీతికి అడ్డాగా మార్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టాం. ఉచిత విద్యుత్‌ హామీ అమలులో భాగంగా 38 లక్షల జీరో బిల్లులు అందజేశాం. ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా పనిచేశాం. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి.. ఆదాయాన్ని స్థిరీకరించాం’’ అని తెలిపారు.

Spread the love