– కేసు చేదిస్తామని పోలీసుల హామీ
నవతెలంగాణ నసురుల్లాబాద్ (బీర్కూర్)
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన దారం నారాయణ గుప్తా (75) అతని భార్య సుశీల (65) లను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. నారాయణ గుప్త కు చెందిన తలుపులు మూసి ఉండడంతో గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాన్సువాడ రూరల్ సీఐ మురళి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం జంట హత్యకు సంబందించిన వివరాలను సేకరించారు. ఈ విషయం ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడంతో బాన్సువాడ డిఎస్పీ రఘునాథరెడ్డి వెంటనే రైతునగర్ చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన దారం నారాయణ గుప్తా నిజామాబాద్ నివాసి. అయన గత 40 ఏండ్ల క్రితం రైతు నగర్ గ్రామానికి చెందిన సుశీలను వివాహం చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారు. కాగా ఇద్దరు భార్యభర్తలు ఇంట్లోనే కిరాణా దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. తమ వద్ద దాచుకున్న కొన్ని డబ్బులను ఇతరులకు అప్పుగా ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. భార్యభర్తలు ఇద్దరు కూడా ఎవరినీ పల్లెత్తి మాట అనేవారు కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ విషయమై బాన్సువాడ రూరల్ సీఐ మాట్లాడుతూ హత్యకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామన్నారు. ఇంటి వెనుక నుండి నిచ్చెన వేసుకొని చొరబడ్డ దుండగులు ఇంట్లో ఉన్న టీవీ శబ్దం ఎక్కువ చేసి ఇతరులకు అరుపులు, కేకలు బయటకు వినపడకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. అయితే నారాయణ గుప్తాను మరణాయుధంతో తలపై బాధి హత్య చేశారన్నారు. సుశీలను చీరతో ఉరితీసి హత్య చేసినట్లుగా ఉన్నదని తెలిపారు. దుండగులను పట్టుకునేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను పిలిపిస్తున్నట్లు అయన తెలిపారు. ప్రశాంతంగా, ఆదర్శనంగా ఉన్న గ్రామంలో ఒకే సారి భార్యాభర్తల దారుణ హత్య జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగక పోవడంతో గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మురళి తెలిపారు.