సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌

సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్‌– గుప్తనిధుల పేరుతో 11మంది హత్య
– గద్వాల జోన్‌ డీఐసీ ఎల్‌ ఎస్‌.చౌహాన్‌ వెల్లడి
నవతెలంగాణ- కందనూలు
సీరియల్‌ కిల్లర్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మూఢనమ్మకాలు, బాణామతి, గుప్తనిధుల పేరుతో అమాయకులను నమ్మించి అత్యంత కర్కశంగా 11పైగా హత్యలు చేసిన నిందితున్ని అరెస్టు చేశారు. అతన్ని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా గద్వాల జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌.చౌహాన్‌ కేసు వివరాలు వెల్లడించారు.
నాగర్‌కర్నూల్‌లోని ఇంద్రానగర్‌ కాలనీకి చెందిన రామటి సత్యనారాయణ యాదవ్‌ తనకు మంత్రశక్తులు వచ్చని.. గుప్తనిధులు వెలికి తీస్తానని ప్రజలను నమ్మించాడు. వారి నుంచి డబ్బు తీసుకోవడంతోపాటు స్థలాలు రాయించుకునేవాడు. ఆ తర్వాత పూజలు చేయాలంటూ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తీర్థం పేరుతో నోట్లో యాసిడ్‌ పోసి 11 మందిని కిరాతకంగా హత్య చేశాడు. వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, కర్నాటకలోని బలగనూరు, ఏపీలోని అనంతపురంలో ఈ హత్యలు చేశాడు. పోలీసుల కండ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్‌ హైదరాబాద్‌లోని బొల్లారంలో నివసించేవారు. నవంబర్‌లో ఆయన నగర శివారులో హత్యకు గురయ్యాడు.
వెంకటేశ్‌ కుటుంబ సభ్యులతో నిందితునికి కొంతకాలంగా పరిచయం ఉండటంలో.. అతనిపైనే అనుమానం వచ్చి అదే నెల 26న నాగర్‌కర్నూల్‌ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్‌ వద్ద డబ్బులు తీసుకున్న అనంతరం క్షుద్రపూజల పేరుతో నిందితుడు నగర శివారుకు తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా విచారణ చేయగా.. అదే తరహాలో అనేక మందిని చంపినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో నిఘా పెట్టి నిందితున్ని అరెస్టు చేశారు.
కారు, మొబైల్‌ ఫోన్లు, సిమ్‌కార్డులు, విష పదార్థాలు, ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఆస్తులపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ప్రాంత ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతున్నారని, అందుకే ఇలాంటి మోసగాళ్ల చేతిలో చిక్కుతున్నారని డీఐజీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసును ఛేదించిన జిల్లా ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌, ప్రత్యేక శ్రద్ధ వహించిన డీఎస్పీ మోహన్‌ కుమార్‌, సీఐ విష్ణువర్ధన్‌ రెడ్డి, ఎస్‌ఐ మహేందర్‌ను అభినందించారు.

Spread the love