జంపన్న వాగులో గల్లంతైన ఆరుగురు మృత్యువాత..

నవతెలంగాణ- ములుగు : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల మల్యాల మధ్య ఉన్న జంపన్న వాగు ఉప్పొంగడంతో ఒక్కసారిగా కట్ట తెగిపోయి వరద ప్రవాహం ఉదృతంగా రావడంతో లోతట్టు గ్రామాలైన కొండాయి గ్రామంలోకి వరద నీరు పోటెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ఓకే కుటుంబానికి చెందిన నలుగురు రషీద్. షరీఫ్, అజ్జు, మహబూబ్ ఖాన్, మరో నలుగురు వ్యక్తులు గల్లంతైన వారిలో ఉన్నారు. కాగా గల్లంతైన వారిలో ఆరుగురు మృత్యువాత పడినట్లు మృతదేహాలను గ్రామస్తులు శుక్రవారం గుర్తించినట్లు సమాచారం. ఎలిసెట్టిపల్లి, కొండాయి, దొడ్ల.మల్యాల, ఎక్కల, భూటారం, గంటల కుంట, మేడారం లోతట్టు ప్రాంత గ్రామాలను ములుగు ఎమ్మెల్యే సీతక్క పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతూ అధికారులతో కోఆర్డినేషన్ చేస్తూ గల్లంతయిన వారిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను చిన్న బోయినపల్లి ఆశ్రమ పాఠశాల, ఏటూర్ నాగారం వైటిసి కేంద్రానికి తరలించారు. రాత్రి సమయంలో కూడా పునర్వాస కేంద్రాలను సందర్శించి వారికి ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొండయి జంపన్న వాగులో గల్లంతయిన వారి ప్రాణాలు కాపాడడం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గల్లంతైన వారు మృత్యువాత పడడంతో సీతక్క కంటతడి పెట్టింది లోతట్టు ప్రాంత ప్రజలు బోరున విలపిస్తున్నారు. గ్రామాలు నీట మునిగి కట్టు బట్టలతో సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న బాధితులు గల్లంతయిన వారికోసం గాలిస్తూ వారు క్షేమంగా ఉండాలని గ్రామస్తులు ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ఎదురు చూడడం జరిగింది. గ్రామస్తులు దొడ్ల గ్రామంలో వంటావార్పు చేసి బాధితులకు అన్నం పెట్టి మేమున్నామంటూ ధైర్యం చేపి వారి వెంట నిలబడ్డారు. లోతట్టు ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడండి ములుగు జిల్లాకు హెలికాప్టర్ తెప్పించండి అంటూ సీతక్క మొదటి నుండి చెప్తూనే ఉంది. ప్రభుత్వం హెలికాప్టర్ జిల్లాకు కేటాయించి హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపడితే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదేమోనని పలువురు వాపోతున్నారు ఇప్పటికైనా ఎలాంటి నష్టం జరగకుండా ములుగు జిల్లాలో హెలికాప్టర్ అందుబాటులో ఉంచి ముందస్తు చర్యలు చేపట్టాలని లోతట్టు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

Spread the love