‘శ్రీరంగనీతులు’

తెలంగాణలో మాదిరిగా పంజాబ్‌లో కూడా శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లును ఆపే ప్రయత్నం చేశారు. దీనికి కూడా గవర్నర్‌ను పావులా వాడుకున్నారు. చివరికి పంజాబ్‌ ముఖ్యమంత్రి కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళి ఆర్డర్‌ తెచ్చుకుంటే తప్ప ఆ బిల్లును ప్రవేశ పెట్టలేకపోయారు. ఇదీ ఇప్పుడు దేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిస్థితి. ప్రతి దానికి కోర్టుకు వెళ్తే తప్ప రాష్ట్రాలునిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి.
‘డొక్కలో గుద్ది తల నిమరడం’ మన ప్రధానికి తెలిసినంతగా మరెవరికీ తెలియదనుకుంటా..! ఇటీవల నీటి అయోగ్‌ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఇది స్పష్టమవుతుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యతతో పని చేస్తేనే దేశ అభివృద్ది అంటూ గొప్పగా ప్రకటించారు. రాష్ట్రాల అభివృద్ధే దేశాల అభివృద్ధి అని కూడా సెలవిచ్చారు. ఆయన చెప్పింది అక్షర సత్యం. మరి గవర్నర్‌ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం చేస్తున్న పెత్తనం సంగతేంటి..? దీనికి ఢిల్లీ ప్రభుత్వం పడుతున్న కష్టమే తాజా ఉదాహరణ. మనది సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాల సమాహారం. ఇది రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులు, విధులను కూడా స్పష్టంగా విభజించారు. అవేమీ పట్టకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వాల గొంతును నొక్కేస్తున్నారు. దీనికి ఆయన సమాధానం ఏం చెబుతారు?
రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్న మోడీ నుంచి ఏది ఆశించినా అది ప్రజల అత్యాశే అవుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్రంగా అణిచివేసే చర్యలే కనిపిస్తున్నాయి. వీసీల నియామకంలోనూ అది స్పష్టంగా కనిపించింది. తాము అధికారంలో లేని చోట గవర్నర్లను ఉపయోగించుకొని పెత్తనం చెలాయించడాన్ని బీజేపీ ఓ విధంగా అమలు చేస్తుంది. మన రాష్ట్రంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గవర్నర్‌ ఏ విధంగా అడ్డుపడుతున్నారో అందరికీ తెలిసిందే. అలాగే కేరళలో పినరాయి విజయన్‌, ఢిల్లీలో కేజ్రీవాల్‌, తమిళనాడులో స్టాలిన్‌, బెంగాల్‌లో మమత ప్రభుత్వాలను గవర్నర్లు, లెప్టినెంట్‌ గవర్నర్లు ఏ విధంగా సతాయిస్తున్నారో కూడా అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్రాల్లోనూ గవర్నర్‌ల జోక్యం తీవ్రమయింది. వీసీల నియామకంలో ఇది మరింత రుజువవుతోంది. తమ హిందూత్వ ఎజెండాను యూనివర్సిటీల్లోకి తీసుకెళ్ళడానికి రోడ్‌ మ్యాప్‌ రూపొందించు కున్నారు. చివరకు కేంద్రం నియంతృత్వాన్ని భరించలేక ఛాన్సలర్‌గా గవర్నర్‌ స్థానంలో ముఖ్యమంత్రులే ఉండేలా కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది.
ఎక్కడో ఎందుకు తెలంగాణలో సైతం శాసనసభ అమోదించిన బిల్లును గవర్నర్‌ తొక్కిపెట్టడం, బిల్లులను క్లియర్‌ చేయకుండా జాప్యం చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీని ఆంతర్యం ఏంటో, దీని వెనుక ఉన్నదెవరో కూడా బహిరంగ రహస్యమే. నిజంగా దేశ అభివృద్ధి కోరుకున్న ప్రధానే అయితే గవర్నర్లను అడ్డు పెట్టుకొని ఇలా సమాంతర ప్రభుత్వాలను నడుపుతాడా? ఇదేనా ప్రజాస్వామ్యమంటే. ఇదేనా సమాఖ్య వ్యవస్థ అంటే. ఇదేనా రాజ్యాంగ విలువలను కాపాడటమంటే..?
ఢిల్లీలో అధికార పంపిణీపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పును ఇచ్చింది. అయినా మోడీ సర్కారు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి దాన్ని ధిక్కరించడం ఎంతటి దుర్మార్గం. ఢిల్లీ ముఖ్యమంత్రికి కనీసం విద్య, వైద్య శాఖల కార్యదర్శులను, కనీసం ఉపకార్యదర్శులను కూడా బదిలీ చేయలేని స్థితి కల్పించారు. ఢిల్లీలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంకెళ్ళు వేశారు. దీనిపై కేజ్రీవాల్‌ సుప్రీంను ఆశ్రయించగా, ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా చేయడం నియంతృత్వమని కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినా మన ప్రధాని మాత్రం అడ్డదారిలో ఆర్డినెన్స్‌ తేవడం ఎంతటి బరితెగింపు. కేంద్రం బీజేపీయేతర రాష్ట్రాలపై ఎంతగా కక్ష కట్టిందో దీన్ని బట్టే తెలుస్తోంది. మన ప్రధానికి కోర్టులన్నా, కోర్టు తీర్పులన్నా ఎంతటి గౌరవం ఉందో కూడా అర్థమవుతోంది.
తెలంగాణలో మాదిరిగా పంజాబ్‌లో కూడా శాసనసభ ఆమోదించిన ఆర్థిక బిల్లును ఆపే ప్రయత్నం చేశారు. దీనికి కూడా గవర్నర్‌ను పావులా వాడుకున్నారు. చివరికి పంజాబ్‌ ముఖ్యమంత్రి కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళి ఆర్డర్‌ తెచ్చుకుంటే తప్ప ఆ బిల్లును ప్రవేశ పెట్టలేకపోయారు. ఇదీ ఇప్పుడు దేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిస్థితి. ప్రతి దానికి కోర్టుకు వెళ్తే తప్ప రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్‌భవన్‌లన్నింటిని బీజేపీ కార్యాలయాలుగా మార్చేసుకుంటున్నారు. ఈ మొత్తం పరిశీలించినప్పుడు ఓ విషయం స్పష్టం. నీటి అయోగ్‌లో మోడీ గారి మాటలన్నీ కేవలం ”శ్రీరంగనీతులే” అని.

Spread the love