నిరుపేద రైతుకు తీరని నష్టం
నవతెలంగాణ-కేశంపేట
పిడుగుపాటుకు రెండు పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో సోమ వారం సాయంత్రం చోటుచేసుకుంది. ఉరు ములు, మెరుపులతో ప్రారంభమై చిన్నపాటి వర్షం కురిసింది. అంతలోనే పెద్ద శబ్దాలతో పిడుగు పడ్డ కారణంగా కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వట్టెల శంకరయ్య రెండు పాడి ఆవులు మృతి చెందాయి. కళ్ళ ముందు జరిగిన సంఘటనను చూసి రైతు శంకర య్యతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రెండు ఆవులు మృత్యువాత పడటంతో ఆరైతుకు రూ.1,60,000( రూ.లక్షా ఆరువై వేలు) నష్టం వాటిల్లందని గ్రామానికి చెందిన తోటి రైతులు తెలిపారు. పాల ఉత్పత్తి పైనే జీవనం సాగించే తమ కుటుంబ పరిస్థితి అతలాకుతలం అయిపోయిందని బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతుకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని తోటి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.