నాటో ఉన్మాదానికి ఉక్రెయిన్‌ బలి!

Ukraine is a victim of NATO frenzy!ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ జరిపిన ప్రతిదాడి పశ్చిమ దేశాలకు కొత్త సమస్య, ఒత్తిడిని ముందుకు తెచ్చింది. ఇజ్రాయిల్‌ మాదిరి తమకు గగనతల దాడుల నుంచి రక్షణ ఛట్రాన్ని ఎందుకు కల్పించరంటూ నాటో కూటమి దేశాలను ఉక్రెయిన్‌ ప్రశ్నిస్తోంది. ఒక టీవితో మాట్లాడుతూ జెలెన్‌స్కీ ఇదే అంశాన్ని ముందుకు తెచ్చాడు. రష్యా ప్రారంభించిన సైనిక చర్య 785వ రోజుకు చేరింది.తన సరిహద్దుకు సమీపంలో ఉన్న చెర్నిహివ్‌ పట్టణంపై రష్యా ప్రయోగించిన మూడు క్షిపణులు 17మంది ప్రాణాలు తీశాయి. మాకు అవసరమైనన్ని ఆయుధాలు సరఫరా చేయకపోతే మేమెలా ప్రతిఘటించాలి అంటూ పశ్చిమదేశాల పావుగా మారిన జెలెన్‌స్కీ ఆర్తనాదాలు చేస్తున్నాడు. క్షిపణి దాడుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని నాటో అధిపతి స్టోల్టెన్‌బర్గ్‌ కోరటం, సిద్దం సుమతీ అన్నట్లుగా మరిన్ని పేట్రియాట్‌ క్షిపణి నిరోధక వ్యవస్థలను తరలించాలని జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షఉల్జ్‌ ప్రకటించాడు. రష్యా హైపర్‌సోనిక్‌ క్షిపణులను అడ్డుకొనేందుకు తమ దగ్గర ప్రస్తుతం ఒకే ఒక్క పేట్రియాట్‌ ఉందని, మరో ఏడు కావాలని బ్రసెల్స్‌లో సమావేశమైన ఐరోపా సమాఖ్య నేతలను జెలెన్‌స్కీ కోరాడు. తమకు తగినన్ని ఆయుధాలు అందచేసి ఉంటే చెర్నిహివ్‌ మీద రష్యా దాడిని ఎదుర్కొని ఉండేవారమ న్నాడు. ఇజ్రాయిల్‌కు మిత్రదేశాల అండతో పాటు రక్షణ చత్రం ఉన్నకారణంగానే ఇరాన్‌ దాడులను జయప్రదంగా ఎదుర్కొన్నదని లేనట్లయితే రక్తం పారేదని, అదే మాదిరి తమకూ ఇతర దేశాల రక్షణ అవసరమని, లేని కారణంగా రష్యా దాడులను నివారించలేకపోతున్నామని జెలెన్‌స్కీ చెబుతున్నాడు. ఇజ్రాయిల్‌ సభ్య దేశం కాకున్నప్పటికీ నాటో దేశాలు రక్షిస్తున్నాయని, దాన్నే తమకూ ఎందుకు వర్తింప చేయరని ప్రశ్నించాడు. అమెరికా సాయం వెంటనే విడుదల చేయకపోతే తామ గెలిచే అవకాశం లేదన్నాడు.రష్యా దగ్గర పది ఫిరంగి గుండ్లు ఉంటే తమ దగ్గర ఒకటే ఉన్నకారణంగా వారు తమను వెనక్కు కొడుతున్నారని చెప్పాడు.
కందకాల్లో ఉన్న తమ మిలిటరీని వెలుపలికి రప్పించేం దుకు టియర్‌గ్యాస్‌ వంటి వాటిని రష్యా పంపుతున్నదని ఉక్రెయిన్‌ కొత్తగా ఆరోపించింది. రష్యా డ్రోన్లన్నింటినీ కూల్చి వేస్తున్నట్లు ఇంతకాలం చెబుతున్న అధికారులు తమ సైనికులు ఉన్న కందకాలపై డ్రోన్లతో గ్యాస్‌ బాంబులు వేస్తున్నట్లు చెప్పటం విశేషం. పశ్చిమ దేశాల జీవాయుధ ప్రయోగశాలలు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు, రసాయనిక ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు రష్యా చెబుతున్న సంగతి తెలిసిందే. గాజాలో ఆసుపత్రులు, సహాయ, నిరాశ్రయులు తలదాచుకున్న శిబిరాల మీద ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులను సమర్థి స్తున్న ఉక్రెయిన్‌ మరోవైపు రష్యన్‌ దాడుల్లో తమ ఆసుపత్రులు, పౌరుల మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నట్లు ఆరోపిస్తున్నది. రెండు సంవత్సరాలు దాటిన సైనిక చర్యలో ఇప్పటి వరకు 18శాతం ఉక్రెయిన్‌ ప్రాంతాలను (స్వాతంత్య్రం ప్రకటించుకున్న రెండు ప్రాంతాలతో సహా) రష్యా అదుపులో ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా మరిని ప్రాంతాలను స్వాధీనం చేసుకొనేందుకు ముందుకుపోతుం డగా జెలెన్‌స్కీ మరిన్ని ఆయుధాలు కావాలని కోరుతున్నాడు. ఎన్ని ఆయు ధాలు ఇచ్చినా ఎంతగా ప్రచారం చేసినా ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను బట్టి ఉక్రెయిన్‌కు ఒరిగేదేమీ లేదని తేలింది.రష్యాను ఎదుర్కొనే సత్తా లేదని ఎరిగినప్పటికీ జెలెన్‌స్కీ ఎందుకు ఇంకా పశ్చిమదేశాల సాయం కోసం పాకులాడుతున్నాడు, రెండేళ్లుగా సాధించలేనిది మరో రెండేళ్లు ఆయుధాలు ఇచ్చినా సాధించగలడా అన్న ప్రశ్నలు ఎవరికైనా తలెత్తటం సహజం. అయినా అతడలా ప్రవర్తిస్తున్నా డంటే పశ్చిమ దేశాల చేతిలో బందీగా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఆయుధాలను మోహరించం, దాని సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు తలపెట్టం అనే ఒక్క మాట నాటో నోటి నుంచి వస్తే తక్షణమే దాడులు ఆగుతాయని తెలుసు. అయినప్పటికీ అదేమీ తెలియనట్లు ఆయుధాలిస్తాం, కొట్టండి, చావండి అన్నట్లుగా జర్మనీ స్పందన ఉంది. పార్లమెంటు ఉభయ సభలు ఉక్రెయిన్‌కు ప్రకటించిన సాయానికి ఆమోద ముద్ర వేస్తే వెంటనే సంతకం చేస్తానని, ఇరాన్‌ లేదా రష్యా ఎట్టి పరిస్థితిలోనూ విజయం సాధించ కూడదని ప్రపంచానికి సంకేతం పంపాలని జో బైడెన్‌ రిపబ్లికన్లను కోరాడు. ఇది యుద్ధోన్మాదం తప్ప మరొకటి కాదు. ఉక్రెయిన్‌ను మరింత నాశనం చేసేందుకే పూనుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Spread the love