70 శాతం మంది కనీసం 8 గ్లాసుల నీళ్లు కూడా తాగట్లేదు

– పదిమందిలో ఏడుగురు తగినస్థాయిలో ఫైబర్‌ తీసుకోవట్లేదు :ఐటిసి లిమిటెడ్‌, న్యూట్రిషన్‌ సైన్సెస్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ భావన శర్మ
నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రతి వ్యక్తి రోజులో నాలుగైదు లీటర్ల నీళ్లను తాగాల్సి ఉండగా మన దేశంలో 70 శాతం మంది కనీసం 8 గ్లాసుల నీళ్ళు కూడా తాగడం లేదని ఐటీసీ లిమిటెడ్‌, న్యూట్రీషన్‌ సైన్సెస్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ భావన శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. పది మందిలో ఏడుగురు తగిన స్థాయిలో ఫైబర్‌ తీసుకోవట్లేదని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ జీర్ణక్రియ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఆశీర్వాద్‌ ఆటా విత్‌ మల్టీ గ్రెయిన్‌ ప్రోటీన్స్‌ ఫుడ్‌, న్యూట్రీషన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ఫైబర్‌ మీటర్‌ టెస్ట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. తమ వెబ్‌సైట్‌లో 69 వేల మంది వ్యక్తులపై ఫైబర్‌ మీటర్‌ టెస్టు నిర్వహించి సమాచారం సేకరించామని తెలిపారు. జీర్ణక్రియలో ఫైబర్‌ అనేది ఎంతో అవసరమైన పదార్ధమనీ, అరుగుదల శక్తిని ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుందనీ, మనిషి ఎక్కువసేపు చురుగ్గా ఉండేలా చేస్తుందని వివరించారు. 47 శాతం మంది ఆరుగంటల కంటే తక్కువ నిద్రపోతున్నారనీ, 35 శాతం మంది ఎటువంటి శారీరక శ్రమ చేయడం లేదని వెల్లడించారు. 40 శాతం మంది కొంతవరకు రోజువారీ శారీరక శ్రమ చేస్తున్నారని వివరించారు.
75 శాతం మంది భారతీయులు ఒకస్థాయి నుంచి అతి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలిపారు. జీర్ణక్రియ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండటానికి జీవన శైలిలో అవసరమైన సానుకూల మార్పులు చేసుకోవడానికి ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. జీర్ణక్రియ సమర్ధవంతంగా పనిచేసేలా చూసుకోవాలంటే ఫైబర్‌ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. అప్పుడే జీర్ణ సంబంధిత వ్యాధులను నివారించగలమని పేర్కొన్నారు.

Spread the love