టీ20 క్రికెట్‌లో సంచలనం రికార్డ్..

నవతెలంగాణ – హైదరాబాద్: పొట్టి క్రికెట్‌లో సంచలనం రికార్డ్ నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్‌ రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు. పురుషుల క్రికెట్‌లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్‌లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ ఫ్రెడ్రిక్‌ ఓవర్డిక్‌ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ బౌలర్‌ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్‌లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం.

Spread the love