పెత్తందారులు వీధులుకే సిమెంట్ రోడ్ లు…

– ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు పట్ల కొనసాగుతున్న వివక్ష….
– గిరిజన ప్రతిపాదితులు – ప్రతిఫలం గిజనేతరులకు… 
– నాయకుల పరం అవుతున్న ప్రజాధనం….
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ పధకం ఏదైనా సామాజికాభివృద్ధితో పాటు దీర్ఘకాలిక బహుళ ప్రయోజనం కోసమో అమలు చేస్తారు.కానీ ప్రభుత్వాలు ఏ పార్టీ ద్వారా ఏర్పడినా సామాజిక ప్రయోజనం మాత్రం పక్షపాతం కొనసాగుతుంది.ఏ పధకాలైనా  ఆయా పార్టీలు నాయకులకు,వారి అనుచరులకు మేలు చేసే విధంగానే రూపకల్పన చేసుకోవడంతో అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. దీనికి మంచి ఉదాహరణ ప్రస్తుతం గ్రామాల్లో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు అని చెప్ప వచ్చు.ఈ రోడ్లు నిర్మాణం ఆయా పంచాయితీల్లో పెత్తందారులు కు సౌకర్యాలు కల్పించడానికి ఏ అన్నట్లుగా ఉంది.ఎస్సీ ఎస్టీ ఆవాసాలు లో సైతం ఆయా పార్టీల గిరిజన నాయకుల వీధుల్లోనే నిర్మించడం కొస మెరుపు. గిరిజన సంక్షేమ నిధులతో నిర్మించే రోడ్లు సైతం గిరిజనుల పేరుతో ప్రతిపాదించి పనులు మాత్రం గిరిజనేతరులే చేస్తుండడంతో మూడు రోడ్లు,ఆరు కల్వర్టు లుగా వారి నిర్మాణ వ్యాపారం వర్ధిల్లుతుంది. సామాజికాభివృద్ది పేరుతో జరుగుతున్న ఈ పనులు ఆయా పార్టీల పెత్తందారులు కు భౌతికంగా,ఆర్ధికంగా మేలు జరుగుతుంది.స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు దాటినా ఎస్సీ ఎస్టీ ఆవాసాలు పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది.
నారాయణపురం పంచాయితీలో కార్యదర్శి మహేశ్వరి తెలిపిన వివరాలు ప్రకారం ప్రస్తుతం ఐటిడిఏ నిధులతో 3,సీ.డీ.పీ నిధులతో 1,ఉపాధి హామీ నిధులతో 1 సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు.ఐటిడిఎ రోడ్లు మూడు ఓ గిరిజనుడు పేరుతో ప్రతిపాదించి, అదే గ్రామానికి చెందిన ఓ ఇరువురు గిరిజనేతర పూర్వ టీఆర్ఎస్ నాయకులు పెట్టుబడితో నిర్మిస్తున్నారు.అయితే ఈ రోడ్లు ఒకటి రెండు గృహాలు ఉన్న పెత్తందారులు వీధుల్లో నిర్మించడం ఇపుడు వివాదం అవుతుంది. ఈ గ్రామంలో ఎస్సీ,ఎస్టీ 21,బీసీ కాలనీ 12  మొత్తం 33 వీధులు ఉంటే ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ వీధుల్లో  6 మాత్రమే సీసీ రోడ్లు,బీసీ కాలనీలో 9 సీసీ రోడ్లు నిర్మించారు.ఈ లెక్కలను బట్టి సామాజిక వివక్ష ఎంత ఉందో తేటతెల్లం అవుతుంది. గతేడాది బీఆర్ఎస్ నాయకుడు ఒకే ఒక గృహానికి సీసీ రోడ్ నిర్మాణం జరగ్గా ప్రస్తుతం మూడు గృహాలు ఉన్న పూర్వ టీఆర్ఎస్ నాయకుడు,ప్రస్తుత ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అనుచరుడిగా చెప్పుకుంటున్న మరో నాయకుడు వీధికి సీసీ రోడ్ నిర్మించడం చర్చాంశనీయంగా మారింది.
Spread the love