నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపండి

– ఎస్పీలు, సీపీలను ఆదేశించిన హౌం మంత్రి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో వర్షాకాల పంటలు వేయడానికి రైతులు సిద్ధమవుతున్న దశలో నకిలీ విత్తనాలను విక్రయించే అక్రమార్కుల ఆగడాలు సాగకుండా వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర హౌం మంత్రి మహమూద్‌ అలీ ఆదేశించారు. నకిలీ విత్తనాల సరఫరా, అక్రమ మద్యం సరఫరాలను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన శుక్రవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం నుంచి నగర కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పని చేస్తున్నదనీ, ఈ విషయంలో ఎక్కడ ఏ చిన్న లోపం జరిగినా సహించే ప్రసక్తే లేదని హౌం మంత్రి అన్నారు. వర్షకాలంలో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు వేస్తారనీ, దీనిని ఆసరా చేసుకొని నకిలీ విత్తనాలను సరఫరా చేసి రైతులను మోసం చేసే శక్తులు తెగబడే ప్రమాదమున్నదని ఆయన అన్నారు. ఈ శక్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉన్నదని చెప్పారు. అదేవిధంగా సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి సరఫరా కాకుండా సరిహద్దులలో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
డీజీపీ అంజనీ కుమార్‌ మాట్లా డుతూ.. గత 8 ఏండ్లలో నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై 986 కేసులను నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే, 1389 మంది నిందితులను అరెస్టు చేశామనీ, ఇందులో 86 మందిపై పీడీ చట్టాన్ని ప్రయోగించామని తెలిపారు.ఈ సమావేశంలో హౌం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జితేందర్‌తో పాటు పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Spread the love