నిపుణుల సూచనల మేరకు పంటలు వేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి మెంగని యాదగిరి
నవతెలంగాణ-నార్సింగి
రైతులు వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు పంటలు వేసుకుంటే కొంతవరకు నష్టాలను నివారించవచని మండల వ్యవసాయ అధికారి మెంగని యాదగిరి సూచించారు. వానాకాలం పంటలపై పలు సలహాలు, సూచనలు రైతులకు అందజేశారు. వానాకాలంలో రైతులు ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. యాసంగి, వానకాలంలో ఒకే రకం పంట వేసుకోవడం వలన భూమి సారాన్ని కోల్పోతుందిని, చీడపురుగులు ఎక్కువగా ఆశిస్తాయన్నారు. తద్వారా దిగుబడి తగ్గి రైతులకు నష్టం చేకూరుతుందన్నారు. వానాకాలంలో వరి పంటను ఆశించేవి మోగి పురుగు, ఆకు మొదలి పురుగు లని, ఒకవేళ ఈ చీడపురుగులు ఆశించినట్లయితే సరైన మోతాదులో మోనోప్రోటోఫాస్‌, కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌, లామ్డాసైహాల్తోరిన్‌ మందులను వాడాలని సూచించారు. పొటాష్‌ వాడకం వల్ల పంటకు, బలం నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పత్తి వేసే రైతులు పతి విత్తనాలు పెట్టేటప్పుడు సమాన దూరంలో విత్తనాలను పెట్టాలనీ, ఇష్టానుసారంగా పురుగుల మందులు వాడ కూడదన్నారు. పంటను చీడపురుగులు ఆశించినట్లయితే రైతులు వేప నూనెను పిచికారి చేయాలన్నారు. సాధ్యమైనంతవరకు రైతులు రసాయనిక ఎరువుల జోలికి వెళ్ళకూడదన్నారు. అనవసర మందులు వాడి పంట పెట్టుబడిని పెంచుకోకూడదని తెలిపారు. మొక్కజొన్న పంట వేసేటప్పుడు విత్తనాలను సమాన దూరంలో కాలువల పద్ధతిలో పెట్టాలలన్నారు. ఈ పంటను ముఖ్యంగా మోగి పురుగులు, కత్తెర పురుగులు ఆశిస్తాయన్నారు. మోగి పురుగులు ఆశించినప్పుడు క్లోరోపైరీఫాస్‌, వేప నూనె పిచకారీ చేయాలనీ, కత్తెర పురుగులు ఆశిస్తే ఏమామెఫ్టిన్‌ బెంజోవేట్‌ మందును వాడాలన్నారు. సోయాబీన్‌ పంటను మడుల పద్ధతిలో వేసుకోవాలనీ, సోయాబీన్‌ కి చీడపురుగుల బెడద తక్కువనీ అన్నారు. మంచి దిగుబడి కోసం భూమి పదును, తేమశాతం సరిచూసుకోవాలనీ ఆయన రైతులకు సూచించారు. ఏ పంట కైనా గాని ఎకరాకు 200 లీటర్ల నీటిలో 80 గ్రాముల మందును కలుపుకోవాలనీ, ఇదే సరైన మోతాదు అని ఈ మోతాదు మించ కూడదని, తగ్గ కూడదని ఆయన తెలిపారు. సలహాలు, సూచనల కోసం వ్యవసాయ కార్యాలయంలోగాని, 091788878445 ఫోన్‌ నంబర్‌లో సంపప్రదించాలని మండల వ్యవసాయ అధికారి మెంగని యాదగిరి సూచించారు.

Spread the love