పేదల నివాసాల కూల్చివేత

నవతెలంగాణ-వైరా
వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గత 15 సంవత్సరాలుగా చిన్న, చిన్న ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్నారు. వారిలో కొంతమంది పేదలు ఆ గ్రామానికి చెందిన వారు కాదన్న సాకుతో వారు నివాసముంటున్న ఇళ్లను మంగళవారం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు కూల్చి వేసి భూమిని యంత్రాలతో సదును చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా గ్రామ గ్రామాన ఖాళీగా ఉన్న స్థలాలను రెవెన్యూ అధికారులు ప్రత్యేక సర్వే చేసి ఏ గ్రామంలో ఎన్ని ఇళ్ళ స్థలాలు ఖాళీగా ఉన్నాయో లెక్కలు తయారు చేశారు. కొన్ని గ్రామాలలో పేదలకు కొన్నేళ్ల క్రితం గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందిన పేదలు ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేక ఖాళీగానే ఉంచారు. ప్రభుత్వం గృహలక్ష్మి పథకంలో మూడు లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించగా పేదలకు ఆశలు చిగురించి ఖాళీ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రయత్నించగా, గతంలో పొందిన ఇళ్ళ పట్టాల గడువు మీరినందున అవి చెల్లవని, వాటిని రెన్యువల్‌ చేసుకోవాలని తెలుపగా మీ సేవా కేంద్రాల్లో అనేక గ్రామాల పేదలు దరఖాస్తు చేసుకున్నారు. కాని సోమవరం గ్రామంలో సుమారు 70 ప్లాట్లలో కొన్నింటిలో పేదలు ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. వారు సోమవరం గ్రామస్థులు కానందున వారిని ఖాళీ చేయిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు సమాధాన మిస్తున్నారు. ఈ చర్యలు ప్రభుత్వం ప్రకటించిన పాలసీకి విరుద్ధంగా ఉన్నది. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పేదలు గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటే జిఓ 58 ప్రకారం పట్టాలు ఇవ్వాల్సి ఉంది. వైరా మండలం స్టేజీ పినపాక గ్రామ పేదలకు 58 జిఓ కింద రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల క్రితం పట్టాలు ఇచ్చారు. అలాగే సోమవరం పేదలకు కూడా పట్టాలు ఇవ్వవచ్చు. ఇప్పటికీ ఖాళీగా ఉన్న స్థలాలను వారు జాగ్రత్త చేసుకుని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. పేదల ఇళ్లను బలవంతంగా కూల్చటంతో నాలుగైదు కుటుంబాల మహిళలు చంటి పిల్లలతో చెట్లకింద దీనంగా చూస్తున్నారు. ఈ కూల్చివేతలు గుట్టుచప్పుడుగా జరుగుతున్నవి. ప్రతిపక్ష పార్టీల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారా అని పేదలను ప్రశ్నించగా చెప్పలేదని వారు అమాయకంగా తెలిపారు. ఈ ప్రభుత్వం దళితులకు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంది అనుకుంటే దళితుల నుండే గుంజు కుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love