ఎక్స్‌ట్రా..ఆర్డినరీ మ్యాన్‌

నితిన్‌ హీరోగా రూపొందుతున్న 32వ చిత్రానికి ‘ఎక్స్‌ట్రా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఆర్డినరీ మ్యాన్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. రైటర్‌, డైరెక్టర్‌ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
డిఫరెంట్‌గా ఉన్న ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో నితిన్‌ రెండు డిఫరెంట్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ఒక దానిలో ఆయన హెయిర్‌ స్టైల్‌, గడ్డంతో సీరియస్‌గా కనిపిస్తున్నారు. అదే పోస్టర్‌లో మరో లుక్‌లో గడ్డం లేకుండా చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ బ్యాగ్రౌండ్‌లో ఓ సన్నివేశానికి సంబంధించిన స్క్రిప్ట్‌ కనిపిస్తుంది. అలాగే క్లాప్‌ బోర్డ్‌ కూడా కనిపిస్తుంది. నితిన్‌ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని, కచ్చితంగా ఆయన అభిమానులనే కాదు, ప్రేక్షకులను కూడా తయన తన బ్రిలియంట్‌ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారని క్లియర్‌గా తెలుస్తోంది. ఈ సినిమాను డిసెంబర్‌ 23న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ, ‘క్యారెక్టర్‌ బేస్డ్‌ స్క్రిప్ట్‌తో ‘కిక్‌’ తర్వాత ఆ రేంజ్‌ జోన్‌లో తెరకెక్కుతోంది. ఇందులో నితిన్‌ సరికొత్తగా కనిపించబోతున్నారు.ఆడియెన్స్‌కి రోలర్‌ కోస్టర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ నవ్విస్తూనే సర్‌ప్రైజ్‌లతో సినిమా మెప్పించనుంది’ అని చెప్పారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌, ఆదిత్యమూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ జైరాజ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

Spread the love