గత మూడు నెలలుగా మణిపూర్ మండిపోతున్నది. సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి కూలీలు జీవనోపాధిని కోల్పోయారు. తిండికి దూరమయ్యారు. మహిళలు అనేక రకాలుగా హింసకు గురవుతున్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అల్లర్లతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మహిళలను నగంగా నడిపించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దేశంలో మహిళల పరిస్థితి ఏంటని ఆవేదన మొదలయింది. ఈ అల్లర్లను అదుపు చేయాల్సిన పాలకులు మౌనంగా ఉండడం ప్రజల్లో మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. ఇటువంటి దారుణ పరిస్థితుల్లో మణిపూర్ మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ రాష్ట్ర ఐద్వా కార్యదర్శి ఆషా బాలా మానవికి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు…
మణిపూర్‌లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
మహిళల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. రోజు వారి జీవనోపాధి కోల్పోయారు. మహిళలపై ఆధారపడ్డ కుటుంబాలు మా దగ్గర చాలా ఉన్నాయి. వీరు సంపాదిస్తే తప్ప కుటుంబం గడవదు. ముఖ్యంగా ఇండ్లల్లోనే ఉండి చేతి వృత్తులు చేసుకుని వాటిని అమ్ముకుని బతికేవారు మణిపూర్‌లో ఎక్కువ మంది ఉంటారు. వీరంతా మహిళలే. అలాగే రాష్ట్ర రాజధాని అయిన ఇంఫాల్‌లోని ఇమామ్ మార్కెట్లో చాలా దుకాణాలు మహిళలే నిర్వహిస్తారు. తమ అడవి ఉత్పత్తులను తెచ్చుకొని అమ్ముకుని జీవిస్తారు. అల్లర్ల వల్ల ఆ దుకాణాలన్నీ మూతబడ్డాయి. లైంగిక దాడులతో మహిళలు అడవులు దాటి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. దాంతో మహిళలు తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోతున్నారు. ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఒక్క పూట తిండి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు చేసే వారికి కొంత వరకు వేతనం వస్తుంది. వీరికి ఆర్థిక ఇబ్బంది లేకపోయినా మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్యా, భర్తలిద్దరూ ఉద్యోగానికి వెళితే తప్ప ఇల్లు గడవదు. అయితే పిల్లలకు పాఠశాలలు లేవు. వారి పిల్లలు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో రెండు నెలల నుండి చదువులు లేక పిల్లల భవిష్యత్ ఏమవుతుందో అనే ఆందోళన తల్లిదండ్రుల్లో వుంది.
ఇప్పుడు గొడవలు కాస్త తగ్గాయని అంటున్నారు… అది నిజమేనా..?
అది కేవలం బయట ప్రచారం మాత్రమే. అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. సాయంత్రం అయితే చాలు ఎక్కడ కాల్పులు జరుగుతాయో అర్థం కాక భయం గుప్పెట్లో బతుకుతున్నాం. రాత్రిపూట అందరం గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుంటున్నాం.
కుకీ మహిళలపై లైంగిక దాడి జరిగిందని తెలిసి దేశం మొత్తం ఆవేదన చెందింది. అక్కడి మైతీ ప్రజలు ఎలా స్పందించారు?
పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. నిజానికి మాకు కూడా ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. మే 3వ తేదీన ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఈ ఘటన ఆ తర్వాతి రోజే జరిగింది. ఆ ప్రాంతం చాలా దూరంగా ఉంటుంది. అలాగే మా దగ్గర ఇంటర్‌నెట్ కట్ చేశారు. అసలు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాతనే మాకూ తెలిసింది. ఘటన జరిగిందని తెలిసిన వెంటనే ఐద్వాగా మేము స్పందించాం. లైంగిక దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని, వాళ్ళకు న్యాయం చేయాలని కార్యక్రమాలు, ప్రదర్శలు చేశాం. ఈ కార్యక్రమంలో కుకీలు, మైతీలు అందరూ ఐక్యంగా పాల్గొన్నారు. మహిళలందరూ జాతులతో సంబంధం లేకుండా ఆందోళనలో పాల్గొన్నారు. ఇది మహిళల సమానత్వానికి, మాపై జరుగుతున్న హింసకు, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు.
మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు కేవలం రెండు జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణ అంటున్నారు. ఇది నిజమేనా..?
రెండు జాతుల మధ్య గొడవ జరుగుతున్న మాట వాస్తవం. కానీ అల్లర్లు చేస్తున్నవారు మాత్రం చాలా తక్కువ మంది. వారిని కూడా బిజేపీ నాయకులు రెచ్చగొడుతున్నారు. నిజానికి కుకీలు, మైతీలు ఇద్దరూ మణిపూర్ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. మహిళలపై జరిగిన దాడిని ఖండిస్తూ అందరూ బయటికి రావడమే దీనికి ఓ ఉదాహరణ. సామాన్య ప్రజలు ఎవ్వరూ హింసను కోరుకోవడం లేదు. మైతీలు కూడా అల్లర్లపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. శాంతిని కోరుతూ జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఐద్వాగా మీరు చేస్తున్న ప్రయత్నం..?
జాతులతో సంబంధం లేకుండా అందరినీ ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఇల్లు తగల బెట్టారు. సాధారణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు సరైన ఆహారం లేక అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రసవమైన మహిళలకు వైద్య సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి వేదన చూస్తుంటే కండ్ల నుండి నీరు కారుతుంది. ఇలా ఇబ్బందులు పడుతున్న వారిలో మైతీలు కూడా చాలా మంది ఉన్నారు. కేవలం కొంత మంది సృష్టిస్తున్న విద్వేషాల వల్ల మా మణిపూర్ ఇలా తగలబడుతుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి కానీ, ప్రధాని కానీ స్పందించడం లేదు. కావాలనే ఈ అల్లర్లు కొనసాగేలా చేస్తున్నారు. రాజకీయ లబ్ది తప్ప ప్రజల ప్రాణాలతో, మహిళల సమస్యలతో వారికి ఎలాంటి సంబంధం లేదు. మాతో పాటు రాష్ట్రంలో వామపక్ష పార్టీలు కూడా శాంతి నెలకొల్పడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మిగిలిన రాజకీయ పార్టీలతో చర్చించారు. కాల్పులు నివారించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
కుకీలు అభద్రతా భావంలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది, ఇది నిజమేనా..?
నిజమే, ప్రస్తుత పరిస్థితుల్లో ఐద్వాగా కార్యక్రమాలు చేయడం మాకూ కష్టంగా మారింది. మైతీలు, కుకీలు, ముస్లింలు మా కమిటీల్లో ఉన్నారు. అల్లర్లపై అవగాహన కల్పించేందుకు కుకీ కమిటీ సభ్యులకు మేం ఫోన్లు చేస్తున్నాము. కానీ వాళ్ళు మాతో మాట్లాడేందుకు భయపడుతున్నారు. గతంలో కుకీలు ఐద్వాలో లేరు. చాలా కష్టపడి వాళ్ళలో నమ్మకం కల్పించి సంఘంలోకి తీసుకొచ్చాము. రెండు కమ్యూనిటీల మధ్య ఐక్యత తీసుకు వచ్చేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నాం. మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయనే విషయం దేశం మొత్తం తెలిసిందే. ప్రస్తుతం కుకీలు అభద్రతా భావంలో ఉన్నారు. ఒకరు తప్పు చేస్తే ఆ జాతి మొత్తం తప్పుడు జాతి అని ప్రచారం చేస్తున్నారు. అది సరైనది కాదు. అలాగే రెండు మతాల మధ్య జరుగుతున్న గొడవలుగా పాలకులు ప్రచారం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రజలు వెనకబాటుకు కారణాలేంటో గుర్తించాలి. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
– సలీమ