మతతత్వ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటాలు

– సీఐటీయు జాతీయ నాయకులు సాయిబాబు
నవతెలంగాణ – బోనకల్‌
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని అధికారం నుంచి గద్ద దింపే వరకు సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తుందని సీఐటీయు జాతీయ నాయకులు ఎం.సాయిబాబు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మధిర నియోజకవర్గ ఇన్చార్జి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో రావినూతల, బోనకల్‌ జోన్ల సమావేశం సిపిఎం రావినూతల శాఖ కార్యదర్శి మందా వీరభద్రం అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ మతతత్వ ఆధారంగా పరిపాలన చేస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థ లను పెట్టుబడిదారులకు కారు చౌకగా కట్ట బెడుతూ పేద ప్రజలపై భారాలు మోపుతుం దన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు, కార్మికుల చట్టాలను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న కార్మికుల హక్కులను ఈ ప్రభుత్వం రద్దుచేసి వీధిన పడేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ(ఎం), సిఐటియు రాజీలేని నికరమైన పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మాట్లాడారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు గుగులోతు పంతు, గుగులోతు నరేష్‌, తెల్లాకుల శ్రీనివాసరావు, నాయకులు బిల్లా విశ్వనాథం, ఉప్పర శ్రీను, భూక్య జాలు, కొంగర భూషయ్య, దొండపాటి సత్యనారాయణ, మచ్చ గురవయ్య, ఏసు పోగు బాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love