పొగలు.. సెగలు…

మనం ఇప్పుడు ఏప్రిల్‌ మొదటి వారంలోనే ఉన్నాం. కానీ మే చివరి వారంలో ఉన్న ఫీలింగ్‌ కలుగుతోంది. ‘సూరయ్య’ దెబ్బకు ఉదయం పది దాటిందంటే చాలు… రోడ్ల మీదికి రావటానికి జనం జంకుతున్నారు. రోడ్ల మీది దాకా ఎందుకు..? ఇంట్లో ఫ్యాన్‌ కింద కూర్చున్నా శరీరం పొగలు.. సెగలూ కక్కుతోంది. లీటర్లకు లీటర్లు నీళ్లు తాగుతున్నా… ఒక్క చుక్కా బయటకు రావటం లేదు. అంతా ఒంట్లోనే ఇంకిపోతున్నవి. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే… మరోవైపు కుండలు, కూలర్లకు భలే గిరాకీ వచ్చింది. పుచ్చకాయలు, కొబ్బరి బోండాలు, నిమ్మ, చెరుకు రసాల బండ్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. ఈ డిమాండ్‌ రీత్యా కాసింత లావాటి పుచ్చకాయ చెట్టెక్కి కూర్చుని రూ.వందిస్తే గానీ దిగిరానంటోంది. కొబ్బరి బోండాల్లో సాధారణ రకం, బెంగళూరు, కేరళ కాయలంటూ రకరకాల వెరైటీల్లో అమ్ముతున్నారు. సాధారణరకం ధర రూ.30గా ఉంటే, మిగతా రకాలకు రూ.60 పెట్టాల్సిందే. అదే లీటరు బాటిల్‌లో కొబ్బరి నీళ్లు నింపుకోవాలంటే రూ.130 సమర్పించు కోవాల్సి వస్తోంది. ఎండదెబ్బకు జనం జేబులు ఈ విధంగా గుల్లవుతుంటే ‘సూర్యారావు’ మాత్రం రోజుకు రోజుకి తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. 40, 43, 45 డిగ్రీలనుకుంటూ వేలం పాటలాగా ఉష్ణోగ్రతలతో హీటెక్కిస్తున్నాడు. బాబ్బాబూ.. మీలో ఎవరైనా వాడికి తెలిసిన వాడుంటే, కాస్త చెప్పండి, ఈ ఉక్కపోత నుంచి, ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం కల్పించమని…అలా చేస్తే ఆయనక్కూడా నాలుగు కొబ్బరి బోండాలు కొట్టిద్దాం…
– బి.వి.యన్‌.పద్మరాజు

Spread the love