
నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ పాలనలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బాటసింగారం డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు వెళ్లాలని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోన్నారు. బాటసింగారానికి వెళ్లేందుకు తమని అనుమతించాలని కిషన్‌రెడ్డి పోలీసులను కోరినప్పటికీ, వారు నిరాకరించడంతో వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీనియర్ నేత డీకే అరుణ తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో శంషాబాద్ ఓఆర్ఆర్ దగ్గర తీవ్ర ఉద్రిక్త నెలకొంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలని డీకే అరుణ ఎద్దేవా చేశారు.