రాముని కొలువులో రాబందులు…!

– మితిమీరిన అవినీతి ఉద్యోగుల ఆగడాలు
– రాముని సొమ్ముతో జలసాలు
– దేవస్థానంలో వెలుగు చూస్తున్న అక్రమాలు
– తీవ్ర ఆవేదనలో రామభక్తులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం మహా పుణ్యక్షేత్రం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని భక్తులు తమ ఇలవేల్పుగా కొలుస్తారు. దేశ నలమూలల నుంచి నిత్యం భక్తులు భద్రాచలంకు తరలివస్తారు. భద్రాద్రి రామునికి భక్తులు భారీగానే కానుకలు సమర్పిస్తారు. ఈ కానుకలతోనే ఆలయ ఆలనా పాలన నిర్వహిస్తారు. అయితే భద్రాచల రామాలయంలో రాముని సొమ్ముని కొందరు ఉద్యోగులు రాబంధులా తన్నుకు పోతున్నారు. జలసాలకు అలవాటు పడ్డ ఈ అవినీతి జలగలు ఏళ్ల తరబడి దేవస్థానంలో పాతుకుపోయి తమ అరాచకాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా దేవస్థానంలో కార్యకలాపాలు కొన సాగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో నూతన ఈవో రంగ ప్రవేశంతో వీరి అక్రమాల పుట్ట పగిలి రోజుకో అవినీతి బాగోతం బట్టబయలు అవుతోంది. జరుగుతున్న పరిణామా లతో రామభక్తులు తీవ్ర కలవరానికి లోనవుతున్నారు.
రాముని కొలువులో రాబందులు :
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కొందరు ఉద్యోగులు చేతివాటానికి పాల్పడుతున్నారు. గతంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరగగా, తాజాగా కొన్ని అక్రమాలు మళ్లీ వెలుగు చూడటంతో అవినీతి చిట్టా బహిర్గతమవుతోంది. దేవస్థానం స్టోర్‌ విభాగంలో కొందరు ఉద్యోగులు చేతివాటానికి పాల్పడిన విషయం బహిర్గతమైనట్లు వినికిడి. తనిఖీ కమిటీ దృష్టికి పలు విషయాలు వచ్చినట్లు తెలిసింది. 2021 ఏప్రిల్‌, 2023 ఏప్రిల్‌ వరకు లెక్కలను పరిశీలించగా ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ వద్ద రూ.3 లక్షల 22 వేలు, మరో జూనియర్‌ అసిస్టెంట్‌ దగ్గర రూ.2లక్షల 50 వేలకు లెక్కలు తేల లేదని తెలిసింది. ఈ నిధులు స్వాహాకు గురైనట్లు గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి దేవస్థానం అధికారులు వీరికి మెమో జారీ చేశారు. ఈ నిధుల పైన వివరణ కోరినట్లు తెలిసింది. ఈ తనికిలు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగినట్లు సమాచారం. ఇంకా అన్నదానం, పడతారం, ప్రచార శాఖ తదితర రిజిస్టర్లు తనిఖీలు చేపట్టాల్సి ఉంది. వీటిల్లో కూడా భారీగానే అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రచారంలో ఉంది. స్టోర్స్‌ విభాగంలో రిజిస్టర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు తెలిసింది. అసలు పలు రిజిస్టర్ల ఆచూకీ లేదన్నట్లు ప్రచారంలో ఉంది. వీఐపీలకు సంబంధించి శాలువా లెక్కలు గోలు మాల్‌గా ఉన్నట్లు సమాచారం. తనిఖీ కమిటీ ఇంకా చాలా రిజిస్టర్లు పరిశీలించాల్సింది ఉందని, ఈ తనికిలో మరిన్ని అవకతవకలు బయల్పడే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా దేవస్థానానికి సంబంధించిన నాదస్వరం విద్వాంసులు ఒకరు పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లంచ అవతారం ఎత్తి ఇటీవల అధికారుల సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇది దేవస్థానానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. కమిషనర్‌ స్థాయి వరకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
రామాలయ భద్రత ప్రశ్నార్థకం…!
ఆలయ ఈవోకు గాని, సదర్‌ కాంట్రాక్టర్‌కు గాని తెలియకుండా ఇద్దరు వ్యక్తులు రామాలయం సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూడటం ఆలయ భద్రత ప్రశ్నార్ధకంగా నిలిచింది. ఈ విషయం ఆలయ రక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ ఎంత పటిష్టంగా ఉందో తేటతెల్లమైంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్‌ పర్యటన ముందే ఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. భద్రత వ్యవస్థ లోపం బట్టబయలు అయింది. ఈ విషయం ఎస్పీఎఫ్‌ అధికారులు గుర్తించకపోవడం శోచనీయం. మూడు నెలల పాటు అనధికార వ్యక్తులు సెక్యూరిటీ విభాగంలో…ఎలా విధులు నిర్వహించారు…? వీరికి అసలు ఆ ఉద్యోగ అవకాశం ఎవరిచ్చారు…? అన్నది మిస్టరీగా మారింది. ఈ వ్యవహారంపై రామాలయం ఈవో స్థానిక పోలీస్‌ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పట్టణ సీఐ విచారణ నిర్వహించారు. ఆ తదుపరి దీనిపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఇద్దరి అనధికార వ్యక్తుల నియామకంలో కూడా దేవస్థానం కార్యాలయం కీలక విభాగాల్లో పనిచేసే ఇద్దరు ఉద్యోగుల పాత్ర ఉందని దేవస్థానం ఉద్యోగుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసుల విచారణలో ఏమి తేలిందో పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
అవినీతి ఉద్యోగులపై చర్యలేవి…?!
దేవస్థానంలో దీర్ఘకాలికంగా విధుల్లో పాతుకుపోయిన కొందరు ఉద్యోగుల అవినీతి, అక్రమాలతో రాముని సొమ్ము పక్క దారి పడుతోందని, ఆలయ ప్రతిష్టతకు భంగం వాటిల్లుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయ ఆదాయ వ్యయాల్లో సైతం ప్రతిసారి ఆడిట్‌ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ గత ఈఓలు విచారణ నిర్వహించి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. నూతన ఈవో రమాదేవి ఆలయ బాధ్యతలు తీసుకున్నాక కీలక విభాగాల ప్రక్షాళన జరుగుతుండటంతో అవినీతి ఉద్యోగుల అక్రమాలు రోజురోజుకు వెలుగు చూస్తున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న వివిధ ఆర్థిక అవినీతి బాగోతం రామ భక్తులను తీవ్ర కలవరానికి లోను చేస్తోంది. మరి రాష్ట్ర స్థాయిలో దేవస్థానం అధికారులు ఈ ఉద్యోగులు ఆగడాలకు ఎందుకు చెక్‌ పెట్టడం లేదో…? వారికే తెలియాలి.

Spread the love