మన సమస్యల్లో నుంచి పుట్టిన కథ

జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజరు సామ్రాట్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్‌ దాస్‌, విమల రామన్‌, గానవి లక్ష్మణ్‌ నటించారు.
ఈనెల 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అజరు సామ్రాట్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ఈ కథ రాసుకున్నాను. తెలంగాణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో చూపించిన సమస్యలు ఎక్కడ ఉంటే, అక్కడి నుంచి ఈ కథను తీసుకున్నట్టే అవుతుంది. అలాగే ఆ సమస్యలు ఎక్కడ వచ్చినా ఇలాంటి పోరాటాలే జరుగుతాయి. దొరల అణిచివేతల మీద ఇది వరకే చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇది పూర్తి భిన్నంగా రాబోతోంది. ఎమోషనల్‌ ఫ్యామిలీ, సోషల్‌ డ్రామాగా తీశాను. పెట్టిన ఖర్చుకంటే విజువల్స్‌ అద్భుతంగా వచ్చాయి. కారెక్టర్‌ మూడ్‌, లైటింగ్‌, డైలాగ్‌ మూడ్‌, టోన్‌ మూడ్‌ ఇలా ప్రతీ ఒక్క చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాను. జగపతి బాబుకి కథ చెబితే, బాగుందని గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. ఆయన ఈ సినిమాకు చాలా కష్టపడ్డారు. ఆయన పాత్రలో ఎక్కువగా లీనమయ్యారు. రోజూ పన్నెండు గంటలకు షూటింగ్‌ రమ్మంటే.. ఉదయం ఎనిమిది గంటలకే వచ్చి సెట్‌లో ఉండేవారు. ఆయన నన్ను ఎక్కువగా నమ్మారు. నిర్మాత రసమయికి సినిమా తీయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. నిర్మాతగా ఆయన ఏం చేయగలడో అన్నీ చేశారు. ‘బాహుబలి, రాజన్న’కు డైలాగ్‌ రైటర్‌గా పని చేశాను. రాజమౌళితో నాకు ప్రొఫెషనల్‌గానే పరిచయం ఉంది. నా దగ్గర ఇంకా కథలున్నాయి. ఈ సినిమా తరువాత వాటి గురించి చెబుతాను. మైత్రీ సంస్థ ద్వారా ఈ సినిమా విడుదల అవుతోంది’ అని తెలిపారు.

Spread the love