డెడ్‌ శాటిలైట్‌ను తొలిసారి భూమిపైకి తెచ్చి కూల్చివేత

నవతెలంగాణ – లండన్‌: డెడ్‌ శాటిలైట్‌ను తొలిసారి భూమిపైకి తెచ్చి సురక్షితంగా సముద్రంలో కూల్చివేశారు. బ్రిటన్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఇంజినీర్లు వాతావరణాన్ని పర్యవేక్షించే ఏయోలస్‌ ఉపగ్రహాన్ని నిర్మించారు. 2018లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) దీనిని లాంచ్‌ చేసింది. ఈ శాటిలైట్‌ కాలపరిమితి ఐదేళ్లు. ఇటీవల ఇంధనంతోపాటు మిషన్‌ కాలపరిమితి ముగిసింది. దీంతో డెడ్‌ అయిన ఈ శాటిలైట్‌ 200 మైళ్లు (సుమారు 320 కిలోమీటర్ల) ఎత్తులో భూమి చుట్టూ తిరుగుతున్నది. అయితే నియంత్రిత పద్ధతిలో భూమి వాతావరణంలోకి తెచ్చి సురక్షితంగా కూల్చివేసే విధంగా ఈ ఉపగ్రహాన్ని రూపొందించలేదు. కాగా, శాటిలైట్‌ ఏయోలస్‌ను సురక్షితంగా కూల్చివేయడం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ఇతర సంస్థలతో కలిసి కొన్ని నెలలపాటు ప్లాన్‌ చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీలోని మిషన్‌ కంట్రోల్‌ నుంచి శాటిలైట్‌ కక్ష్యను తగ్గించే చర్యలు చేపట్టారు. దీంతో ఈ నెల 24న ఆ డెడ్‌ శాటిలైట్‌ 280 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నది. ఆ తర్వాత దాని ఎత్తు 250 కిలోమీటర్లకు తగ్గించారు. అలా క్రమంగా ఉపగ్రహం ఎత్తు తగ్గిస్తూ వచ్చారు. శుక్రవారం నాటికి భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు ఏయోలస్‌ చేరుకున్నది. అనంతరం దాని కక్ష్యను మరింతగా మార్పు చేశారు. చివరకు ఆ శాటిలైట్‌ అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా కూలింది.

Spread the love