ఢిల్లీ ఆర్డినెన్స్‌పై బిల్లును అనుమతించొద్దు

– రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్‌ లేఖ
న్యూఢిల్లీ : ఢిల్లీ పరిపాలనా కార్యకలాపాల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి అనుమతించవద్దని ఆప్‌ కోరింది. ఈ మేరకు ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దా ఆదివారం రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌కు లేఖ రాశారు. మే 11న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఢిల్లీలోని ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిల్‌ సర్వెంట్లు ప్రజల చేత ఎన్నికైన ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలికి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అందుకు భిన్నంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పెత్తనం అప్పగించేలా ఉన్న కేంద్రం ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని, అందుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. పార్లమెంటు చేసే ఏదైనా చట్టం ఆర్టికల్‌ 239 ఎఎ నిబంధనలకు అనుబంధంగా ఉండాలని, ఆ నిబంధనలకు విరుద్ధమైన ప్రతిపాదిత బిల్లు పార్లమెంటులో చెల్లుబాటు కాదని తెలిపారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి అనుమతించవద్దని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Spread the love