కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా నేడు తెలంగాణ ట్రై క్రీడా వేడుక

– ఏర్పాట్లను పర్యవేక్షించిన శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రి కె.తారకరామారావు పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం నాడు నిర్వహించబోయే తెలంగాణ ట్రై క్రీడావేడుక-2023కు ఏర్పాట్లు పూర్తయ్యాయని శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ తెలిపారు. ఆదివారం దానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ సైక్లింగ్‌ అసోసియేషన్‌, తెలంగాణ రోరల్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌, తెలంగాణ ఆమెచ్యూర్‌ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ సంయుక్త నిర్వహణలో సైక్లింగ్‌, రోరల్‌ స్కేటింగ్‌ మరియు రెజ్లింగ్‌ (మహిళ) పోటీల ప్రారంభోత్సవానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్‌, స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. లక్ష్మి, తదితరులు పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. మనిషికి ఆరోగ్యాన్ని అందజేసే, అతి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ఏకైక క్రీడాంశం సైక్లింగ్‌ అనీ, ఆ క్రీడకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ కృషి చేస్తున్నదని తెలిపారు.
మానవ సమగ్రాభివృద్ధి క్రీడలతో సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సైక్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మల్లారెడ్డి,దత్తాత్రేయ మోసపాటి, డిప్యూటీ డైరెక్టర్‌ చంద్రారెడ్డి, అర్జున అవార్డు గ్రహీత అనూప్‌ కుమార్‌ యామ, చైర్మెన్‌ ఓఎస్డీ డాక్టర్‌ కే.నర్సయ్య, నిర్మల్‌ సింగ్‌, జితేందర్‌ సింగ్‌, తదితరులు పాల్గొన్నారు

Spread the love