‘జన చైతన్యానికి పాటు పడిన ఇప్టా’

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
జన చైతన్యానికి పాటు పడిన చరిత్ర గల సాంస్కతిక సంస్థ ఇప్టా అని ఆ సంస్థ జాతీయ ఉపాధ్యక్షులు కందిమల్ల ప్రతాపరెడ్డి అన్నారు. గురువారం హిమాయత్‌నగర్‌, ఎన్‌. సత్యనారాయణరెడ్డి భవన్‌లోని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యాలయం వద్ద ఇండియన్‌ ప్యూపిల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ (ఇప్టా) 80వ ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షులు కందిమల్ల ప్రతాపరెడ్డి ‘ఇప్టా’ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1943 మే 25న ఉన్నతమైన లక్ష్యాలతో ఇప్టా ప్రారంభించబడిందనీ, దేశం కోసం యుద్దానికి వ్యతిరేకంగా అటు స్వాతంత్ర పోరాటంలో ఇటు తెలంగాణలో కళారూపాలు తయారు చేసి జన చైతన్యానికి పాటు పడిన చరిత్ర గల సాంస్కతిక సంస్థ ఇప్టా అని ఉద్బోధించారన్నారు. దానికి అనుబంధంగా ప్రజానాట్య మండలి తెలుగు రాష్ట్రాల్లో పురుడు పోసుకుందని గుర్తు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి.నర సింహ మాట్లాడుతూ కళ ప్రజల కోసం అని చాటి చెప్పిన సంస్థ ఇప్టా అనీ, ప్రజానాట్య మండలి అని ఉద్యమాలకు ఊతమిచ్చేది కళాకారులేనని కొనియాడారు. విప్లవ సినీ నటులు, నిర్మాత రెడ్‌ స్టార్‌ మాదాల రంగారావు 75వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సినీ రంగంలో ఆయన పోషించిన విప్లవాత్మక పాత్రను నెమరు వేసుకుని జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవీంద్ర చారి, రాష్ట్ర నాయకులు ఛాయాదేవి, ముత్యాల యాదిరెడ్డి, స్టాలిన్‌, ఇప్టా జాతీయ కార్యదర్శి పల్లె నరసింహ, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్‌, కె.స్వామి, కన్నం లక్ష్మీనారాయణ, వి.కొండల్‌ రావు, కె.ఉప్పలయ్య, పి.నళిని, ఎ.రవి, వేణుగోపాలచారి, గణేష్‌, సైదులు, సుధాకర్‌, రామస్వామి, అర్జున్‌, మానస, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love