చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీ ఉద్యమం

నవతెలంగాణ – చేర్యాల
చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూలిమిట్ట మండలాలతో కూడిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు అయ్యేంత వరకూ జేఏసీ గా అంచలంచలుగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ తెలిపారు. చేర్యాల పట్టణ కేంద్రంలోని వాసవి గార్డెన్ లో గురువారం నిర్వహించిన జేఏసీ, అఖిలపక్షం సమావేశంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశంతో పాటు చేర్యాల మీదుగా రైల్వే మార్గం, నియోజకవర్గం పునరుద్ధరణ, ఇంటి పన్నులు తగ్గించాలని, కోర్టు ఏర్పాటు తదితర అంశాలపై పోరాడేందుకు తీర్మానం చేశారు . ఈసందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తూ నాలుగు మండలాల గ్రామపంచాయతీలు తీర్మానాలు చేసినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం అన్ని పార్టీలతో కలిసి ఐక్య కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరో ఉద్యమానికి సిద్ధమయ్యేలా పోరాట కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. డివిజన్ సాధన కోసం పోరాటానికి ప్రజలు సిద్దంగా ఉండాలని ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ పుర్మ ఆగంరెడ్డి, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మంచాల చిరంజీవులు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరయ్య, బీఎస్పీ నియోజకవర్గ నాయకులు బస్వగళ్ళ సిద్ధయ్య, మాజీ జడ్పీటీసీ దాసరి కళావతి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, ఇంటి పన్ను బాధితుల సంఘం అధ్యక్షుడు బద్దిపడగ నరసింహారెడ్డి, జేఏసీ అఖిలపక్షం నాయకులు నక్కల యాదవ రెడ్డి, ఈరి భూమయ్య, గూడ రాజిరెడ్డి, తాడెం ప్రశాంత్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, బిజ్జ రాము, చందా శ్రీకాంత్, పుట్ట రాజు, బండకింది అరుణ్ కుమార్, ఆముదాల రంజిత్ రెడ్డి, పోతుగంటి ప్రసాద్, మల్లేశం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love