నిజాంబాద్ లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

– ఎండల ప్రచండం, ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు
– భానుడి ప్రతాపంతో జనం విలవిల
– రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
– నిర్మానుషంగా మారుతున్న రోడ్లు
– శీతల పానియాలపై చూపు
– సుమారు 43 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు
నవతెలంగాణ – కంటేశ్వర్
రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మాడలు మలమల మాడుతున్నాయి. నిజాంబాద్ లో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండల ప్రచండంతో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతూ భానుడి ప్రభాతంతో జనం విలవిలలాడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ప్రజలు శీతల పానీయాల వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.ఏప్రిల్ నెలలోనే భానుడి భగభగలతో జనాలు విలవిల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలకే ఉప్పెనల ఎండలు ఆరంభమై సాయంత్రం 6 గంటల వరకు తీవ్రంగా ఉంటున్నాయి. ఎండాకాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరి ఎప్పుడు లేని విధంగా అత్యధికంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు క్రమక్రమేన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరో రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ ఉంటాయని వడగాలులు విస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజల ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ విధంగా ఎండలు ఉంటే అసలు ముందున్న మే మాసంలో ఎలా ఉంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
రోడ్లమీద జనం లేక..
నగరంలో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండడంతో మధ్యాహ్నం వేళాలో రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు కూడా వేస్తుండడంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో ఎక్కడ చూడాలన్న రోడ్లపై ఒక్కరూ కనిపించడం లేదు. ప్రధాన రహదారులు నిర్మానుషంగా కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి 12 30 గంటల లోపు పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి..
ఎండ వేడిమితో ప్రజలు ఉక్కిరిబికిరవుతున్నారు. బయటకు వెళ్లాలంటే బాబోయ్ ఎండ..ఇంట్లో ఉంటే ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు.
వేసవి ఉష్ణోగ్రతల అత్యధిక స్థాయికి చేరుకోవడంతో ఫ్యాన్లు, కూలర్లు కూడా సరిపోవడం లేదు. ఫ్యాన్లు వేసిన వడగాలి రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరమైతే బయటకు వచ్చిన సమయాల్లో కూడా ఎండా నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు, టవాళ్లు, టోపీలను ఆశ్రయిస్తున్నారు. మరో పక్క దాహార్తిని తీర్చుకోవడానికి శీతల పానీయాలు చెరుకు, రసం, లస్సి జ్యూస్ లాంటివి సేవిస్తున్నారు. రోడ్డు పక్కన సోడా బండ్లకు బలే గిరాకీ ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, కీర దోసకాయలు, మజ్జిగ తీసుకుంటే వేసవి తాపం మరింత ఉప శమనం పొందవచ్చునని కొబ్బరి బొండాల నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
కొబ్బరి బొండాలకు పెరిగిన గిరాకీ..
నగరంలో ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు కొబ్బరి బొండాల దుకాణాల వద్ద కొబ్బరి నీళ్ళు తాగడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రసిద్ధి చెందిన సాయి బెంగళూరు కొబ్బరి బొండాలు జనంతో కిటకిటలాడుతుంది.
వడ దెబ్బతో జాగ్రత్త..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఓ బాలుడు వడదెబ్బతో మృతి చెందిన విషయం తెలిసింది. అందుకు అనుగుణగా వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతను చూసుకొని బయటకు వెళ్లాలని లేదంటే వడదెబ్బకు గురికావాల్సిన పరిస్థితి ఎదురవుతుందని భావిస్తున్నారు.రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు , దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఆరు బయట పనిచేయవలసి ఉన్న వారు, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు, ఎండాకాలం సాధ్యమైనంత మట్టుకు నీడలో ఉండాలని బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉదయము 10 గంటలకు ముందు కానీ, సాయంత్రం వాతావరణం చల్లబడ్డ తర్వాత బయటి పనులు చూసుకోవాలని, ఇంటి కిటికీలను తెరిచి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలని అయితే వేడిగాలి రాకుండా గది చల్లగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ఎండలో వెళ్ళవలసి వస్తే గొడుగు తీసుకువెళ్లడం కూలింగ్ గ్లాసెస్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వీలైనంతగా మంచినీళ్లు తాగుతూ ఉండాలని శరీర లవణాలను కోల్పోకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెమటను గ్రహించి చల్లగా ఉండే  కాటన్ దుస్తువులు ధరించాలని, వడదెబ్బ కు దోహదం చేసే మందులు డాక్టర్ సలహా మేరకు మోతాదు తగ్గించడం కానీ చేయాలి అని శీతల పానీయాలు తీసుకోవడం మంచిది కాదు అని, వాటికి బదులుగా కొబ్బరి బొండం మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎండాకాలం తగిన జాగ్రత్తలు తీసుకొనిఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Spread the love