పోషకాలుండే మునగాకు…

సహజంగా ములక్కాయలను కూరగానో, సాంబారు లోనో ఉపయోగిస్తాం. అందరూ వీటిని ఇష్టంగా తింటారు కూడా. వీటి వల్ల అనేక ప్రయోజనాలున్నాయని మనకు తెలుసు. కానీ ములక్కాయలతో పాటు మునగాకులోనూ అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. మునగాకుతో వంటలు ఎక్కువగా గ్రామాలలో చేస్తుంటారు. వీటి గురించి మన అమ్మమ్మలకు, నాయనమ్మలకు తెలుసు. ఇప్పుడు ఇందులోని ఔషధ గుణాల గురించి మనమూ తెలుసుకుందాం…
– కాల్షియం, ఫైబర్‌, ఐరన్‌ మునగాకులో పుష్కలంగా ఉంటాయి. మరే ఇతర ఆకుకూరల్లోనూ మనకు లభించని ఏ, సి విటమిన్లు ఇందులో ఉంటాయి.
– కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఫైబర్‌ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గడంలో సహాయ పడుతుంది.
– హై బీపీ, లో బీపీలను అదుపు చేయడం లోనూ మునగాకు పాత్ర ప్రధానమైనది.
– కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మునగాకు ఆహారంతో పాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
– గర్భిణీలను రక్తహీనత నుండి కాపాడుతుంది. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
– రక్తంలో ఎర్ర రక్తకణాలను పెంచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ లెవల్‌ని కంట్రోల్‌ చేస్తుంది. యాంటీ బాక్టీరియల్‌ గుణాలు కలిగి ఉండి చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌ల నుంచి రక్షిస్తుంది.
– మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌లు ఉన్నవాళ్ళు దీన్ని తీసుకుంటే మంచిది. కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నవారు మునగాకు తీసుకోకూడదు.
ఇన్ని ప్రయోజనాలున్న మునగాకును నెలలో కనీసం రెండు సార్లు తప్పక తీసుకోవాలి.

Spread the love