పంత్‌ ఫటాఫట్‌

పంత్‌ ఫటాఫట్‌– రిషబ్‌, అక్షర్‌ అర్థ సెంచరీలు
– టైటాన్స్‌పై క్యాపిటల్స్‌ గెలుపు
– ఢిల్లీ 224/4, గుజరాత్‌ 220/8
నవతెలంగాణ-న్యూఢిల్లీ
గుజరాత్‌ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉత్కంఠ విజయం సాధించింది. 225 పరుగుల భారీ ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఛేదనలో సాయి సుదర్శన్‌ (65, 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్‌ మిల్లర్‌ (55, 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో రాణించినా గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 220 పరుగులే చేసింది. అంతకుముందు, రిషబ్‌ పంత్‌ (88 నాటౌట్‌, 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (66, 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (26 నాటౌట్‌, 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కదం తొక్కటంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 224/4 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. రిషబ్‌ పంత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఢిల్లీకి ఇది నాల్గో విజయం కాగా, గుజరాత్‌కు నాల్గో పరాజయం.
పంత్‌, అక్షర్‌ జోరు : టాస్‌ నెగ్గిన గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సందీప్‌ వారియర్‌ను తుది జట్టులోకి తీసుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ పవర్‌ప్లేలోనే ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. ఓపెనర్లు పృథ్వీ షా (11), జేక్‌ ఫ్రేసర్‌ (23, 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహా నం.4 బ్యాటర్‌ షారు హోప్‌ (5)ను సందీప్‌ వారియర్‌ సాగనంపాడు. జేక్‌ రెండు సిక్సర్లు, ఫోర్లతో మెరిసినా.. సందీప్‌ వారియర్‌ జోరుతో పవర్‌ప్లేలో టైటాన్స్‌ పైచేయి సాధించింది. 6 ఓవర్ల అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 44/3తో నిలిచింది. కష్టాల్లో కూరుకున్న క్యాపిటల్స్‌ను కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (88 నాటౌట్‌)తో కలిసి అక్షర్‌ పటేల్‌ (66) ఆదుకున్నాడు. ఈ జోడీ నాల్గో వికెట్‌కు 68 బంతుల్లో 113 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. అక్షర్‌ పటేల్‌ దూకుడుగా ఆడగా.. ఆరంభంలో పంత్‌ నెమ్మదిగా ఆడాడు. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 బంతుల్లో అక్షర్‌ పటేల్‌ అర్థ సెంచరీ సాధించగా.. రిషబ్‌ పంత్‌ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 34 బంతుల్లో ఆ ఘనత అందుకున్నాడు. అర్థ సెంచరీ అనంతరం వరుస సిక్సర్లు బాదిన అక్షర్‌ పటేల్‌ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ చేజార్చుకున్నాడు. ఆఖర్లో పంత్‌తో జతకట్టిన ట్రిస్టన్‌ స్టబ్స్‌ (26 నాటౌట్‌) అదరగొట్టాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో స్టబ్స్‌ విజృంభించగా.. ఆఖరు ఓవర్లో మోహిత్‌ శర్మపై రిషబ్‌ పంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖరు మూడు బంతులను హ్యాట్రిక్‌ సిక్సర్లుగా స్టాండ్స్‌లోకి పంపించిన పంత్‌ ఆ ఓవర్లో నాలుగు సిక్సర్లు, ఓ ఫోర్‌ సహా 31 పరుగులు పిండుకున్నాడు. ఈ జోడీ 18 బంతుల్లోనే 67 పరుగులు పిండుకుంది. డెత్‌ ఓవర్లలో స్టబ్స్‌, పంత్‌ ఊచకోతతో చివరి ఐదు ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 97 పరుగులు సాధించింది.

Spread the love