రోడ్లే కల్లాలు..పొంచివున్న ప్రమాదాలు..

– మండలంలో కనిపించని ఎండు కల్లాల 
నవతెలంగాణ – మల్హర్ రావు
వరి ధాన్యం అరబెట్టుకునేందుకు రైతులకు ఎండు కల్లాలు కరువై రోడ్లే దిక్కవుతున్నాయి.అయితే రోడ్లపై ధాన్యం అరబోస్తుండటంతో రోడ్లు ప్రమాధాలుగా మారి పలువురు తీవ్రంగా గాయపడుతున్న పరిస్థితి. గత సంవత్సరం క్రితం మండలంలోని పెద్దతూoడ్ల, తాడిచెర్ల ప్రధాన రహదారి,ఎడ్లపల్లి, రుద్రారం ప్రధాన రహదారిపై పలువురు తీవ్రంగా గాయపడిన సంఘటనలు తెలిసిందే.అయితే ప్రభుత్వం ఎండు కల్లాలు నిర్మించుకునేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులుస్తున్న బిల్లులు సకాలంలో చెల్లించడంలో  తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు కల్లాలు నిర్మించుకునేందుకు అనాశక్తి చూపడం, ఇందుకు తోడుగా స్థలాల కొరత ఉండటంతో కల్లాల నిర్మాణాల్లో రైతులు ముందుకు రావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ఎండు కల్లాల నిర్మాణాలపై సంబంధించిన ఈజిఏస్ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పటికి ఒక్కటి కూడా పూర్తి కాలేదు.
కల్లాలు నిర్మాణం శూన్యం..
ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలో 139 కల్లాల నిర్మాణాలకు గాను.రూ.1కోటి 60 లక్షల 92 వేలు మంజూరైయ్యాయి. రెండేళ్ళ క్రితం క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాగా ఇప్పటి వరకు  ఒక్కటి కూడా నిర్మాణం పూర్తి కాలేదంటే ఉపాధి హామీ సిబ్బంది పనితీరు ఇట్టే అర్దవుతుంది. కల్లాలు పురోగతిలో మాత్రం 42 ఉండగా వీటికి ఇప్పటికే రూ.9 లక్షల 92 వేల బిల్లులు చెల్లించారు.ఇంకా 97 కల్లాలకు అసలే పనులు ప్రారంభం కాలేదు.కల్లాలు 538 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.58 వేలు, 645 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.68 వేలు, 807 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.85 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే మార్కెట్ల రేట్ల ప్రకారం వీటి నిర్మాణానికి అధిక వ్యయం కావడంతో పాటు బిల్లులు సకాలంలో రాకపోవడం,స్టలాల  సమస్యల వలన రైతు ఎండు కల్లాల నిర్మాణాలపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
రోడ్లపై దాన్యంతో అనుకోని ప్రమాదాలు..
ఈ ఏడాది రబీ సీజన్ తో వరిదాన్యం దిగుబడులు మాములుగా వస్తున్నాయి. ధాన్యం అరబెట్టుకునేందుకు స్థలాలు లేక ప్రధాన రహదారులు, గ్రామీణ రోడ్లపై రైతులు పోస్తున్నారు. రాత్రి సమయంలో కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పి ఉంచుతున్నారు. పలుచోట్ల రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయంతోపాటు రోడ్లలో సగం స్థలాన్ని అక్రమించడం దాన్యంలోకి వాహనాలు రాకుండా చుట్టూ పెద్డ పెద్ద బండరాళ్లు పెట్టి ఉంచుతున్నారు. దీంతో ఒకవైపు రోడ్లలోనే వాహనాలు రాకపోకలు కష్టంగా మారాయి.ముఖ్యoగా రాత్రివేళల్లో దాన్యం కుప్పలను ఢీకొని తీవ్రంగా గాయపడుతున్నారు.
Spread the love