మీ కోసం కాస్త సమయం

గృహిణికి ఇల్లు చక్కబెట్టడం, పిల్లల బాధ్యతలతో సరిపోతుంది. ఇక ఉద్యోగినైతే? ఆఫీసు పని అదనం. వీటన్నింటిలో పడి మీ గురించి పట్టించుకోవడం మర్చిపోవద్దు అంటున్నారు నిపుణులు.
ఎంతసేపూ పిల్లలకు, ఆయనకు అన్నీ సమకూర్చాలి.. సమయానికి వాళ్లను స్కూలు, ఆఫీసుకు పంపాలన్న తొందరేనా? దీనివల్ల మీ మనసు, శరీరం రెండూ అలసిపోతాయి. ఉద్యోగం చేస్తున్నా ఇంట్లోవాళ్లకి సరిగా అమర్చడం లేదని భావించే మహిళలే మనలో ఎక్కువ. ముందా భావన పక్కనపెట్టండి. రెండు రకాలుగా శరీరాన్ని కష్టపెడుతున్నారని గ్రహించి.. రోజూ కొంత ‘నా సమయం’ అని కేటాయించుకోండి. ధ్యానం, నింపాదిగా తాగే కాఫీ, చిన్నపాటి వ్యాయామం.. ఆ వేళల్లో ఏదైనా చేయొచ్చు.
‘బుజ్జిదానికి ఇది నచ్చదు’, ‘పెద్దాడికి ఫలానాది ఇష్టం’ అని ఎంచి ఎంచి చేస్తుంటాం. మరి మీ సంగతేంటి? ఏదో ఒకటి నోట్లో వేసుకొని బస్సు కోసం పరుగు తీయడమేనా? ఇంట్లో వాళ్లందరి గురించీ ఆలోచించేప్పుడే ‘మరి నాకు?’ అన్న ప్రశ్న వేసుకోండి. ఎంత హడావుడిలో ఉన్నా పోషకాలున్న ఆహారం తీసుకోవాల్సిందే. ఒక్కసారిగా కుదరకపోతే ఇంట్లో కొంచెం, బస్సులో పండ్లు, ఆఫీసులో స్నాక్స్‌గా నట్స్‌.. ఇలా ప్లాన్‌ చేసుకున్నా మంచిదే.
ఇంట్లో ఎలా ఉన్నా ఆఫీసులో నీరసంగా ఉంటే ఉద్యోగినులకు కుదరదు. ఎప్పుడూ పనంటూ తిరుగుతోంటే శరీరానికి మాత్రం ఉత్సాహం ఎక్కడ్నుంచి వస్తుంది? అందుకే యోగా, నడక, డ్యాన్స్‌.. ఇలా నచ్చిన వాటి కోసం 30 నిమిషాలు వీలు చేసుకోండి. ఒత్తిడి తగ్గడమే కాదు.. శరీరానికీ ఉత్సాహం.
ఉదయాన్నే పనులన్నీ చకచకా పూర్తవ్వాలని ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం మంచిదే కానీ.. అలాగని నిద్రని మాత్రం త్యాగం చేయొద్దు. కనీసం 7గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. వీటన్నింటినీ చక్కగా ప్లాన్‌ చేసుకుంటేనే శరీరం, మనసు తేలికపడి మీ బాధ్యతలు ఇంకా మెరుగ్గా చేస్తారు. ప

Spread the love