ఊగిసలాట

– రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి స్వరాలు
– కర్నాటక ఫలితాలతో పునరాలోచనలో నేతలు
– ఢిల్లీ వెళ్లిన ఈటల
– అధిష్టానం ఎదుట పలు డిమాండ్లు
– కొండా విశ్వేశ్వరరెడ్డి హాట్‌ కామెంట్స్‌
– క్రమశిక్షణ తప్పితే ‘వేటు’ తప్పదంటున్న బండి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీజేపీలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. కర్నాటకలో ఆపార్టీ ఓటమి తర్వాత ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు పునరాలోచనలో పడ్డారు. బీజేపీ నుంచి పోటీచేస్తే గెలుపోటములపై లెక్కలు కట్టుకుంటున్నారు. దక్షిణాదిలో ఆపార్టీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే సంకేతాలను కర్నాటక ప్రజలు ఇచ్చారనీ, తెలంగాణలో కూడా అందుకు భిన్నమైన తీర్పు ఉండబోదనే అంచనాలతో రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి వారి జాబితా రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజసింగ్‌ ఆపార్టీలో ఉన్నట్టో, లేదో అర్థంకాని పరిస్థితి. దీనితో ఆయన ఇతరపార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి మార్పు అంశం తెరపైకి వస్తున్నది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ రెండ్రోజులు ఢిల్లీలో మకాం వేసి, రాష్ట్ర నాయకత్వంపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. అదే సమయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా రాష్ట్ర నాయకత్వంపై ఘాటైన వ్యాఖ్యలే చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ఢిల్లీలో దోస్తీ…గల్లీలో కుస్తీ అంటూ కామెంట్స్‌ చేశారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ చాలామంది బీజేపీ నేతలు మెల్లగా అక్కడి నుంచి సర్దుకోవాలని చూస్తున్నట్టు రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఈ తలనొప్పులు తట్టుకోలేని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజరు పార్టీ కట్టుబాట్లు, క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదంటూ తీవ్ర అసహనంతో మీడియా సమక్షంలో హెచ్చరికలు చేస్తున్నారు. దీనితో పువ్వు పార్టీలో ఏదో గడబిడ జరుగుతున్నదనే చర్చ మొదలైంది. వీటన్నింటికీ కర్నాటక ఎన్నికల్లో ఓటర్లు కొట్టిన చావుదెబ్బలే కారణమని విశ్లేషిస్తున్నారు. ఇక ఢిల్లీ వెళ్లిన ఈటల రాజేందర్‌ తాను చేరికల కమిటీ చైర్మెన్‌గా ఉండననీ, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అధిష్టానాన్ని కోరినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరికల విషయంలో దూకుడేది అని అధిష్టానం ప్రశ్నిస్తే…పార్టీలోని ఓ వర్గం సహకరించడం లేదంటూ ఆయన ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అదే సమయంలో కొండావిశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో కొన్ని మార్పులు అవసరమనీ, అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న స్పీడ్‌ చాలదంటూ మీడియా ఎదుట విశ్లేషణ చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తాను కేసీఆర్‌ను ఓడించే వారెవ్వరితోనైనా జట్టు కడతాననీ ప్రకటించడం కమలంలో కలకలం సృష్టించింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత అరెస్టుపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అసందర్భంగా పదేపదే వ్యాఖ్యలు చేయడం, ఇప్పటి వరకు ఆమె అరెస్టు కాకపోవడం వంటి అనేక విషయాలను అసంతృప్తనేతలు ప్రస్తావిస్తున్నారు. నోటికొచ్చిన మాటలు మాట్లాడి బండి పార్టీకి నష్టం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. బండికి వ్యతిరేకంగా ఆపార్టీ ఎంపీ అర్వింద్‌కుమార్‌ కూడా కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. కవితపై బండి చేసిన కామెంట్స్‌ బండి వ్యక్తిగతమనీ, దానికీ బీజేపీకి సంబంధం లేదంటూ ఆయన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పలువురు ముఖ్యనేతలు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో రహస్యంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లి, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. ఓటమి తర్వాత ఆయన పార్టీలో ఎక్కడా క్రియాశీలంగా కనిపించట్లేదు. మాజీ ఎంపీ జీ వివేక్‌ కూడా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నవారిలోనూ ఆ పార్టీలో ఉంటే తాము గెలవలేమోనన్న సందేహం మొదలైంది. దీంతో వారంతా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారని సమాచారం. బీజేపీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీల్లో వారిలో వారికే సఖ్యత లేదనే చర్చా జరుగుతున్నది. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు బీజేపీ అధికారిక కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారు. ఖమ్మం జిల్లా నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు నిన్న మొన్నటి వరకు కమలం కండువా కప్పుకొనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. కర్నాటక ఫలితాల తర్వాత వారు కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీలో ఈ ముసలం తారాస్థాయికే చేరేట్టు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Spread the love