జాబిలమ్మను అందించిన అమ్మలు

The Ammas who offered Jabilammaబిడ్డకు గోరుముద్దలు తినిపించేందుకు ‘చందమామ రావే… జాజిల్లి రావే… కొండెక్కి రావే… గోగుపూలు తేవే’ అని పాటపాడని అమ్మలు ఉండరు. వీరూ అలాంటి సాధారణ అమ్మలే. అయితే దేశం గర్వంచదగ్గ గొప్ప విజయంలో భాగస్వాములయ్యారు. అందుకే ఇప్పుడు వారికి అంతటి ప్రాధాన్యం. వారే మహిళా శాస్త్రవేత్తలు. భారతదేశాన్ని అంతరిక్ష పరిశోధనా రంగంలోకి ప్రవేశపెట్టిన వారు వీరే. ఇస్రోలోని 16,000 మంది ఉద్యోగులలో దాదాపు 20 నుండి 25శాతం మంది మహిళలున్నారు. వారిలో కొందరు వివిధ మిషన్లలో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల జరుపుకున్న చంద్రయాన్‌ 3 మిషన్‌ విజయోత్సవంలో బయటకు ఎక్కువమంది పురుషులు కనబడి ఉండవచ్చు. కానీ దాదాపు 54 మంది మహిళా శాస్త్రవేత్తలు ఈ విజయంలో వివిధ స్థాయిలలో భాగమయ్యారు. వీరిలో మన తెలుగు మహిళ కల్పన కూడా ఉండడం మనకు గర్వకారణం. చంద్రయాన్‌ 3 విజయంలో కీలకపాత్ర పోషించిన కొందరు మహిళా శాస్త్రవేత్తల గురించి క్లుప్లంగా ఈ రోజు మానవిలో…

ఊరికి పేరు తెచ్చింది
కల్పన.కె…. చంద్రయాన్‌ 3 సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన వాళ్లలో కల్పన ఒకరు. ఈమె మన తెలుగు మహిళ కావడం మనకు గర్వకారణం. ఈమె చంద్రయాన్‌3 కు అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. చిత్తూరు జిల్లాలోని నగరి మండలం తడుకు పేటకు చెందిన కల్పన చంద్రయాన్‌ 3 ఉపగ్రహం జాబిల్లికి సేఫ్‌గా చేరడంతో సొంతూరి కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి. కల్పన తండ్రి మునిరత్నం చెన్నై హైకోర్టులో అధికారి కావడంతో ఆమె విద్యా భ్యాసం చెన్నైలోనే పూర్తి చేసుకున్నారు. మద్రాస్‌ యూని వర్సిటీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్లో ఇంజనీరింగ్‌ చేసిన కల్పన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ఉద్యోగాన్ని సంపాదించారు. 2000లో ఇస్రో నోటిఫికేషన్‌తో రాడార్‌ ఇంజినీర్‌ గా ఉద్యోగంలో చేరారు. 2005 లో బెంగళూరులోని సాటిలైట్‌ సెంటర్‌కు బదిలీ అయింది. శాటి లైట్‌ భవన్‌లో సాటిలైట్‌ సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా విధుల్లో చేరి అసో సియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా చేరి ఇలా తన ఉద్యోగ ప్రస్థానంలో చంద్రయాన్‌ 3 ప్రయోగం సక్సెస్‌లో భాగస్వామ్యమయ్యారు.
ఉపగ్రహం డిజైన్‌, హార్డ్‌ వేర్‌ తయారీ తర్వాత పలు పరీక్షలు పూర్తిచేసి షార్‌కు చేరుకున్న చంద్రయాన్‌ 3 రాకెట్‌ సాయంతో నింగిలోకి పంపిన టీంలో కల్పన కీలక పాత్ర పోషించారు. రోజుకో సవాల్‌ను అంకిత భావంతో ఎదుర్కొన్న ఆమె తన పని సామర్థ్యంతో ప్రశంసలు అందుకున్నారు. నగరి గడ్డలో పుట్టి దేశ కీర్తి ప్రతిష్టలు చాటిచెప్పే ప్రయోగంలో లక్ష్యాన్ని చేరిన కల్పనను గ్రామ ప్రజలు ఎంతగానో అభినందిం చారు. తడుకు పేటలోని పాఠశాలలో విద్యార్థులు జాతీయ జెండాతో చంద్రయాన్‌ సక్సెస్‌ సంబరాలు జరుపుకోగా కల్పన కుటుంబం, గ్రామం ఆమె గొప్పతనాన్ని కీర్తించారు.
ఇప్పుడు ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) విశేషమైన విజయాలను ప్రదర్శిస్తూ దేశానికి గర్వ కారణంగా నిలిచింది. విజయవంతమైన మిషన్‌ను బయటకు తీసుకు రావడానికి పగలూ, రాత్రి అంకిత భావంతో శ్రమించిన శాస్త్రవేత్తలకే ఈ క్రెడిట్‌ దక్కుతుంది. అయితే ఆ సంస్థ అనేక విజయవంతమైన మిషన్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తల సహకారం మరింత స్ఫూర్తిదాయకం.
అంతరిక్షం, సాంకేతికతలో అగ్రగామి…
డాక్టర్‌ వి.ఆర్‌ లలితాంబిక… గత ఏడాది భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే లక్ష్యంతో పని చేసిన గగన్‌యాన్‌ మిషన్‌కు ఈమె డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇస్రో నిర్వహించిన 100కి పైగా మిషన్లలో ఆమె అంతర్భాగంగా ఉన్నారు. ఇస్రోలో చేరక ముందు ఆమె విక్రమ్‌ సారాభారు స్పేస్‌ సెంటర్‌ (విఎస్‌ఎస్‌సి)లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. అక్కడ ఆమె నియంత్రణ, అనుకరణ, మార్గదర్శక విధులను పర్యవేక్షించారు.
ఇస్రో మొదటి మహిళా శాటిలైట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌
అనురాధ టికె… తన కెరీర్‌లో దాదాపు 34 ఏండ్లు పదవీ విరమణ చేయడానికి ముందు ఇస్రోకు అంకితమై పని చేశారు. ఆమె ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో ఆమె అనేక పదవులను నిర్వహించారు. GSAT-9, GSAT-17, GSAT-18  అనే మూడు కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల ప్రయోగాలను పర్యవేక్షించే బాధ్యత కూడా ఈమె చూస్తున్నారు..
చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌
వనితా ముత్తయ్య… నిష్ణాతులైన ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ ఇంజనీర్‌ అయిన ఈమె చంద్రయాన్‌ – 2 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అక్కడ ఆమె పని ప్రారంభమైంది. అలాగే ఉపగ్రహ ప్రాజెక్టులను పర్యవేక్షించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈమె పని భారతదేశ అంతరిక్ష యాత్రలకు గణనీయంగా దోహదపడింది.
భారత రాకెట్‌ మహిళలు
రీతూ కరిధాల్‌… భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో ఈమె సీనియర్‌ శాస్త్రవేత్త. చంద్రయాన్‌-2 కోసం మిషన్‌ డైరెక్టర్‌గా, భారతదేశ మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (ఎంఓఎం) మంగళయాన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఆప్టికల్‌, ఐఆర్‌ సెన్సార్‌లను అభివృద్ధి చేయడం, పరీక్షించడం
మౌమితా దత్తా… ఆప్టికల్‌, ఐఆర్‌ సాధనాలు, సెన్సార్లు, పేలోడ్‌ల అభివృద్ధి, పరీక్షలో ప్రత్యేకత కలిగిన భౌతిక శాస్త్రవేత్త ఈమె. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ (ఎంఓఎం), చంద్రయాన్‌-3 మిషన్‌ రెండింటిలో ఈమె గణనీయమైన కృషి చేశారు. ప్రస్తుతం ఆమె ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు సంబంధించిన పరిశోధనలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే గ్యాస్‌ సెన్సార్‌లను సూక్ష్మీకరించడంపై దృష్టి సారించింది.
మంగళయాన్‌ డిప్యూటీ ఆపరేషన్‌ డైరెక్టర్‌
నందిని హరినాథ్‌… రెండు దశాబ్దాలుగా ఇస్రోకు అంకితమై పని చేస్తున్నారు. 20 ఏండ్ల పాటు సాగిన ఆమె అద్భుతమైన కెరీర్‌లో 14 మిషన్లలో పాలుపంచుకున్నారు. అలాగే మంగళయాన్‌కు డిప్యూటీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ మేనేజర్‌, మిషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్రోతో కలిసి సైన్స్‌ రంగంలో దేశానికి వన్నె తెస్తున్న మహిళా జాబితా అంతులేనిది. అనేక మంది మహిళా శాస్త్రవేత్తలు ఇస్రోలోని వివిధ మిషన్లలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
– సలీమ

Spread the love