– విషాదంలో తెలుగు చిత్రసీమ
– నేడు చెన్నైలో అంత్యక్రియలు
సంగీత సంచలనం రాజ్ మరణవార్తను పూర్తిగా జీర్ణించుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు శరత్‌బాబు (72)ని చిత్ర సీమ కోల్పోయింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్‌బాబు మెరుగైన వైద్యం కోసం నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఎఐజీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్) కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత నెల రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. శరత్‌బాబు అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు. టాలీవుడ్‌లో ఉన్న అతి కొద్ది మందిలో హీరోలను మించి అందంగా, హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన హీరోలకు సరి సమానంగా వెండితెరపై ఆకట్టుకుంటూ ప్రేక్షకులను మెప్పించారు. ఆహార్యం, యూనిక్ వాయిస్‌తో హీరోలా కనిపించే రూపంతో అందరి మనసులు దోచుకున్నారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, స్నేహితుడిగా, తండ్రిగా, అన్నగా, విలన్‌గా.. ఇలా విభిన్నమైన పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా, ఆల్‌రౌండర్‌గా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న శరత్‌బాబు జీవిత విశేషాలు..
పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని..
శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1951, జూలై 31న ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆముదాల వలసలో జన్మించారు. 8 మంది అన్నదమ్ములు, ఐదుగురు అక్కా చెల్లెళ్లలో శరత్‌బాబు నాలుగోవారు. స్కూల్ రోజుల్లోనే ఆయన నాటకాల్లో నటించారు. హీరోకి ఉండాల్సిన లక్షణాలన్ని పుష్కలంగా ఉండటంతో కాలేజీ రోజుల్లో అందరూ సినిమాల్లో ట్రై చేయమని శరత్‌బాబుకి సలహా ఇచ్చారు. దీనికి తండ్రి నిరాకరించిన, తల్లి ప్రోత్సాహంతో డిగ్రీ తర్వాత సినిమా వైపు అడుగులు వేశారు. అయితే సినిమాల్లోకి వచ్చిన చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ శరత్ బాబు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనుకుని యాక్టర్ అయ్యారు.
తండ్రి హోటల్ బిజినెస్ చేసేవారు. తనని కూడా అదే బిజినెస్ చూసుకోమనే వారట. కానీ శరత్ బాబు మాత్రం పోలీస్ ఆఫీసర్ కావాలనుకునేవారు. కాలేజీ రోజుల్లో కంటి చూపు దెబ్బతింది. అదే ఆయన పోలీస్ కావాలన్న కలని కలగానే మిగిల్చింది.
రామరాజ్యంలో హీరోగా..
మద్రాసు వెళ్ళి ఆదుర్తి సుబ్బారావుని కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో రామవిజేత అనే సంస్థ కొత్తవాళ్ళతో సినిమాలు తీస్తున్నారని వెళ్ళారు. అప్పటికే అక్కడ వెయ్యి అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిల్లో మూడు సెలెక్ట్ చేశారు. అందులో శరత్‌బాబు ఒకరు. ఆయనే హీరోగా సెలెక్ట్ అయ్యారు. అలా ‘రామరాజ్యం’ (1973) సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాలోనే జగ్గయ్య, ఎస్వీరంగారావు, సావిత్రి, చంద్రమోహన్, చంద్రకళ వంటి హేమాహేమీలతో నటించారు. ఈ సినిమా దర్శక, నిర్మాతలు సత్యంబాబు దీక్షితులు పేరుని శరత్‌బాబుగా మార్చారు. ఆ తర్వాత అట్లూరి పూర్ణ చంద్రరావు స్క్రీన్ టెస్ట్ చేసి, ‘స్త్రీ’ చిత్రంలో సపోర్టింగ్ హీరోగా చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఏవీఎం సంస్థ నిర్మించిన ‘నోము’లోను, డూండీ తెరకెక్కించిన ‘అభిమానవతి’ చిత్రంలోనూ పవర్‌ఫుల్ నెగటివ్ రోల్స్‌లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ నటించడానికి శరత్‌బాబు వెనుకాడలేదు. అదే ఆయనకు సినీ పరిశ్రమలో సుదీర్ఘ ప్రస్థానానికి బాగా ఉపయోగపడింది.
మలుపు తిప్పిన దిగ్దర్శకులు
బాలచందర్ దర్శకత్వంలో నటించిన ‘నిళల్ నిజమాగిరదు’ తమిళ చిత్రం మంచి విజయం సాధించింది. శరత్‌బాబు తొలిసారి పరభాషలో సాధించిన సక్సెస్. దీని తర్వాత ఆయన కెరీరే మారిపోయింది. అయితే నటుడిగా ఓనమాలు దిద్దుకున్నది బాలచందర్‌గారి దగ్గరే అని శరత్‌బాబు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆయన్ని పరిశీలిస్తే చాలు.. నటనే నేర్చుకోవచ్చన్నారు. అలాగే విశ్వనాథ్‌గారిని పరిశీలించడం ద్వారా టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ గురించి తెలుసుకున్నానని తెలిపారు. బాపుగారితో సినిమా చేసేటప్పుడు నటన కాకుండా క్యారెక్టర్ మాత్రమే సహజంగా కనిపించేలా నటించడం అలవాటు చేసుకున్నారు. అర్టిస్ట్‌గా శరత్‌బాబు కెరీర్‌ని మలుపు తిప్పిన దర్శకులు వీళ్ళు. ఆ తర్వాత దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి.. ఇలా చాలా మంది దర్శకులు శరత్‌బాబుతో విలక్షణ పాత్రలు వేయించారు. అలాగే సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రంగనాథ్ హీరోగా నటించిన ‘పంతులమ్మ, అమెరికా అమ్మాయి’ వంటి సినిమాల్లో శరత్‌బాబు నటించారు. ఈ సినిమాలు ఆయనకు తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చి పెట్టాయి.
ఇక కె. బాలచందర్ రూపొందించిన ‘చిలకమ్మ చెప్పింది’ సినిమా కూడా రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సాధించడంతో తమిళ, తెలుగు భాషల్లో అవకాశాలు పెరగడం మొదలైంది. అలాగే కన్నడ ఇండిస్టీలోనూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
8 నంది పురస్కారాలు
పలు భాషల్లో దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించిన శరత్‌బాబు తన కెరీర్‌లో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఎనిమిది నంది పురస్కారాల్ని దక్కించుకున్నారు. 1981, 1988, 1989 సంవత్సరాల్లో వరుసగా మూడు నంది పురస్కారాలని సొంతం చేసుకున్నారు. ”సీతాకోక చిలుక, ఓ భార్య కథ, నీరాజం’ సినిమాలకు వరుసగా ఈ నంది అవార్డుల్ని అందుకున్నారు.నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే నటి రమా ప్రభను 1974లో వివాహం చేసుకున్నారు. పద్నాలుగేళ్ల తర్వాత వీరి వైవాహిక జీవితానికి తెర పడింది. 1990లో స్నేహ నంబియార్‌ని వివాహం చేసుకున్న శరత్ బాబు ఆమెకు కూడా 2011లో విడాకులిచ్చారు.
ఆల్‌రౌండర్‌ని కోల్పోయాం..
విలక్షణ నటునతో, వైవిధ్యమైన పాత్రలతో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన శరత్‌బాబు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఏఐజీ ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం 5.30 నుంచి 7.30వరకు ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. మంగళవారం చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సీనియర్ నటుడు శరత్‌బాబు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 220కి పైగా చిత్రాల్లో నటించిన శరత్‌బాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. శరత్‌బాబు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – సీఎం కేసీఆర్
అందం, హూందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శరత్‌బాబు నేను నటించిన అనేక చిత్రాల్లో నటించారు.
ఆయన మరణ వార్త కలచివేసింది. – చిరంజీవి
శరత్‌బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం ఉన్న నటులు. ఆయనతో కలిసి పని చేయటం మర్చిపోలేని అనుభూతి. – బాలకృష్ణ
నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’, అలాగే ‘వకీల్‌సాబ్’లో కూడా నటించారు. హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా భిన్న భావోద్వేగాలను పలికించారు. – పవన్‌కళ్యాణ్
తెలుగులో నటించిన చిత్రాలు
రామరాజ్యం, మరో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, తాయారయ్యా బంగారమ్మ, మూడు ముళ్ళ బంధం, రాధా కళ్యాణం, సీతాకోక చిలుక, సాగర సంగమం, సితార, కాంచనగంగ, అన్వేషణ, స్వాతి, స్వాతిముత్యం, కాష్మోరా, సంకీర్తన, సంసారం ఒక చదరంగం, అభినందన, జీవన జ్యోతి, స్వాతి చినుకులు, కోకిల, క్రిమినల్, హలో బ్రదర్, సిసింద్రి, గమ్యం, పెళ్ళి సందడి, నువ్వు లేక నేను లేను, శంకర్‌దాదా ఎంబీబీఎస్, శ్రీరామదాసు, శౌర్యం, నాగవల్లి, షిర్డిసాయి, నేల టిక్కెట్ వంటి తదితర చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. అలాగే పలు సీరియల్స్‌లోనూ నటించారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో శివాజీ గణేషన్, జయలలిత, జయసుధ, రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలకష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్‌కల్యాణ్‌తో పాటు నేటి తరం హీరోలు రామ్‌చరణ్, సూర్య వంటి వారితోనూ కలిసి నటించారు. శరత్‌బాబు తెలుగులో చివరి సారిగా కనిపించిన చిత్రం నరేష్ నటించిన ‘మళ్ళీ పెళ్ళి’.