కళల్లో కలల్లేవెందుకు?

కళల్లో కలల్లేవెందుకు?అరవై నాలుగు కళల గురించి గుదిగుచ్చిన మన శాస్త్రకారులు వాటిలో కలలు కనడాన్ని చేర్చకపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ…! ఆశయం కోసం బతకడం, లక్ష్య సిద్ధి కోసం కలలు కనడం ఒక రకమైతే, ప్రజల్ని ఆశయ రహితులుగా చేసి జోకొట్టే పాలకుల కనికట్టుకు లోనై శవాల్లాగా, దూలాల్లాగా ప్రవాహం వాలుకు పడికొట్టుకుపోయేవారు అత్యధికులు. నాడు తెల్లదొరల పాలనకు ‘జోహుకుం’ అంటూ తలదించి లొంగిపోయిన రాజులు, మహరాజులు ఎందరో! దోపిడీ రహిత స్వతంత్ర భారతాన్ని కలగన్న భగత్‌సింగ్‌లు, బటుకేశ్వర్‌ దత్‌లు, అష్వఖుల్లాఖాన్‌లు కొందరే అయినా నేటికీ కోట్లాదిమందికి దారిదీపాలై ప్రకాశిస్తున్నారు.
అబ్దుల్‌ కలామ్‌ దేశ యువతీ, యువకుల్ని కనమన్న కలలు వేరు. నేటి భారత ప్రధాని ప్రజల్ని కలలు కంటూనే ఉండమంటున్న తీరు వేరు. అబ్దుల్‌ కలామ్‌ దేశ యువతను తమ బంగారు భవిష్యత్‌ను కలగనమన్నాడు. అందుకు కృషి కీలకమన్నాడు. ‘పుస్తకం హస్త భూషణం’గా కాక అధ్యయన శీలురుగా యువత ఉండాలని స్వప్నించిన వ్యక్తి కలామ్‌ సాబ్‌. మోడీ చెప్పే కలలే వేరు. యువతకేం ఖర్మ, దేశ జనాభానంతటినీ బిజీగా వందేభారత్‌ రైళ్ళెక్కి ఊరేగమన్నట్టు కలగనమంటున్నాడు. ఎలాన్‌మస్క్‌ నోయిడాలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఫ్యాక్టరీలు పెట్టినట్టు, రామమందిర నిర్మాణంలో ఉద్యోగాలు దొరికిన యువత పోనూ మిగిలిన యూపీ పోరగాండ్లందరికీ ఐదారు వేల రూపాయల జీతానికి ఆ కంపెనీల్లో ఉద్యోగాలొచ్చినట్టు కలగనమంటున్నాడు. ఆ రకంగా, దేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో 83శాతం యువతేనన్న ఐఎల్‌ఓ రిపోర్టు తప్పని కలగనమంటున్నాడు.
2013, 2014 ఎన్నికల సమయంలో తనని గనుక ఢిల్లీలో సింహాసనాదీశుణ్ణి చేస్తే భారతదేశాన్ని ‘గుజరాత్‌ తరహా’లో అభివృద్ధి చేస్తానన్న మోడీ వాగ్దానం గుజరాత్‌ బుడగ 2015లోనే ఠప్పున పేలిపోయింది. చిన్న పరిశ్రమలు దివాళా తీసి కొందరు, దేశమంతటిలాగే వ్యవసాయం దెబ్బతిని ఉపాధిలేక రోడ్డెక్కి లక్షలాదిమంది ఉద్యోగాల కోసం ఎగబడ్డారు. పాటీదార్‌ ఆందోళన ‘గుజరాత్‌ మోడల్‌’ గుట్టు రట్టు చేసింది. సాలుకి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నది 2014 బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో. ఆ తర్వాత దావోస్‌లో పకోడీలు చేసుకోవడమూ ఉపాధేనని అంతర్జాతీయంగా దేశం పరువుతీశారు మోడీ. తాజాగా చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ అసలు ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదంటు న్నాడు. వెరసి, 2014లో మోడీ ఆర్థిక సలహాదారులు అమాయకులా? మోసగాళ్ళా? పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు అమాయకులుండే అవకాశమే లేదు. కాబట్టి కచ్చితంగా మోసం చేసే మోడీ సింహాసనాధీశుడైనాడు.
మోడీ లేటెస్ట్‌ నినాదం దేశంలో నాలుగే కులాలున్నాయంట. అవి యువతట, మహిళలట, రైతులట, చివరిగా మరో బ్రహ్మపదార్థం ‘పేదలట’! వారికోసమే తన ప్రభుత్వం పనిచేస్తోందట! రైతుల పంటలకవసరమైన కనీస మద్దతుధర ఈ ప్రభుత్వం ప్రకటించదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చు కూడా వెళ్ళక ప్రయివేటు అప్పులు, వడ్డీలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే రైతులు పేదల లెక్కలోకి రారేమో! వ్యవసాయ రంగంలో సగటు వేతనాలు మోడీ దశాబ్దపాలనలో 12.3శాతం నుండి 4.8శాతానికి పడిపోయాయి. వ్యవసాయేతర రంగాల్లోనూ ఈ దశాబ్దకాలంలో వేతనాల పరిస్థితి ఇదే. సంఘటిత రంగంలోని కార్మికుల వేతనాలూ ఈ రకంగానే దిగజారాయని యాన్యువల్‌ సర్వే ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. నికర వాల్యుయాడెడ్‌లో వేతనాల భాగం 1980వ దశకంలో 30.4శాతం నుండి 2014-21కి 16శాతానికి పడిపోయింది. అసంఘటిత కార్మికుల స్థితి మరీ ఘోరం. కొనుగోలుశక్తి పడిపోయిన దేశంలోని కోట్లాది కష్టజీవుల గురించి ఈ ప్రభుత్వానికి ఖాతరే లేదులాగుంది. మోడీ చెప్పే నాల్గవ కులం మహిళలు. పైన చెప్పిన రైతుల, వ్యవసాయ కూలీల, కార్మికుల, ముఖ్యంగా 90శాతంపైగా ఉన్న అసంఘటిత కార్మికుల్లో కోట్లల్లో స్త్రీలు న్నారు. ఆయన చందాకొచార్‌ గురించి, ఇంద్రనూయీ గురించీ, నీతూ అంబానీ గురించి మాట్లాడితే వారంతా ఎప్పటికీ మోడీ పక్షమే.
ఇటీవల సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి సర్వే వెలువడింది. మోడీ పదేళ్ళ పాలన ధనికులకే ప్రయోజనం చేకూర్చిందన్న అభిప్రాయం ఎల్లెడలా వచ్చిందని సదరు నివేదిక పేర్కొంది. నిరుద్యోగం, ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగం ఒక తీవ్ర సమస్యగా ఉందని 2024 ఎన్నికల్లో ఆర్థికాంశాలే కీలకం కాబోతున్నాయని ఆ సర్వే తేల్చింది.
నిజాలివి కాగా బీజేపీకే 370 అని, ఎన్‌డీయేకి 400 దాటబోతున్నాయని మోడీకి మచ్చికైన మీడియా వెల్లడిస్తోంది. మరో పదిహేను రోజుల్లో రానున్న మేడేకి నినాదాలిచ్చి బాగా లొల్లి చేస్తే మోడీ కల చెదురుతుంది. జూన్‌ 4న ఫలితాలొచ్చే వరకైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి.

Spread the love