అస్తిత్వం తాత్వికతల జమిలీగానం

Existence is a confluence of philosophies”మనిషోకపద్యం” అంటూ గతంలో కవిత్వ పాఠకుల్ని అలరించిన మెట్టా నాగేశ్వరరావు ఇప్పుడు మరోసారి నిలువెల్లా మనిషైన పద్యాన్ని ‘నేను కొన్ని సూఫీ సమయాలు’ అంటూ మనల్ని పలకరించడానికి ముందుకొచ్చాడు. అయితే ఈ కవి ఎక్కడా ఆగలేదు. ఆగడానికి ఇతను నిలువ నీరు కాదు. ఊటబావి. నీటి బుగ్గ. ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు ఈ కవికి సిలబస్‌. ఈ కవి వాక్యాలు ప్రకృతి చుట్టే వలయాలు వలయాలుగా పరిభ్రమిస్తున్నాయి. తాను చూసిన జీవితాల నుండి తాత్వికతను వడకట్టాడు. కవిత్వానికి తాత్వికతను అద్దడం కొత్తేమి కాదు. ఆ తాత్వికతను ప్రకటించడంలో కవి చూపిన సృజన ఏమిటీ? వాటికి అతను ఇస్తున్న ఆకరాలు ఏమిటి? అనేది ఈ కవితా సంపుటిని నిలబెడుతుంది.
”నేను సూఫీనవుతున్నాను/ హృదయాన్ని కన్నులుగా చూస్తున్నాను/ భ్రమలెప్పుడూ నా దృశ్యాలు కావడం లేదు/ నేను నిశ్చింతగా సాగిపోతున్నాను/ లోకం జోలెలోకి నన్ను/ దుఃఖం కాల్చని ఉపాయంగా ఇస్తున్నాను”… ఇక్కడ సాక్ష్యంగా ఉన్న ఈ ఆరు వాక్యాలు, ఈ కవి చూస్తున్న మనకు చూపుతున్న, వాగ్దానం చేస్తున్న తన ప్రస్తుత స్థానం. అయితే ఇలాంటి స్ఫూర్తిని అతను ఎక్కడి నుంచి పొంది ఉంటాడు? అనే ప్రశ్న వేసుకుంటే ఎప్పుడూ ప్రయాణించమని చెప్పే నది, ఆకలి తీర్చుకోవడానికి గూడు వదిలి భూగోళాన్ని గాల్లోనుండి అన్వేషించే పక్షి, సముద్రాల్లో విశ్రాంత గదుల్లేని చేప, కన్నీటి యుద్ధంలో గెలిచే ఉపాయం చెప్పే ఒక వాక్యం, ఎప్పుడు ముగిసిపోని ప్రయాణం చేసే జీవితం ఇతరుల గుండెల్లో నిలిపిన జ్ఞాపకాలు ఇవ్వన్నీ ఈ కవికి స్ఫూర్తి.
నీడ బొమ్మల్లో తోలుబొమ్మలాట చూడటం, చెట్టు బొమ్మ గీస్తున్నప్పుడు నీడ చిత్రం గీయడం, ఎవరి నీడ వారికే ఉండాలని, ఒకరి నీడలా మనం మారకూడదని, ఒరిజినాలిటీ అంటే మన నీడను మనమే అణువణువు పూరించుకోవాలని నీడ తాత్వికతను తెలిపాడు. కవికి దర్శనం ఒకటి ఉంటుంది. ”మెట్టా”లో దర్శన సౌభాగ్యం బాగుంది. మనం రోజు చూసే వస్తువులు, లేదా అంతకుముందే కవిత్వం అయినా వస్తువుల గురించి మెట్ట కొన్ని కవితలు రాశాడు. అయినప్పటికీ దర్శనంలో ఉన్న విభిన్నత కారణంగా అవి కొత్తగా ఉన్నాయి. ఈ దర్శనం కేవలం ప్రదర్శనమైతే కవిత కూలిపోతుంది. ఆ దర్శన గుణం ఈ కవిలో అడుగడుగునా మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ‘రాళ్లు’ శీర్షికతో రాసిన కవిత ఇందుకు చక్కని ఉదాహరణ. అసలు నాగరికత మొదలైంది రాయి రాయి రాసుకున్నప్పుడే అని మొదలుపెడతాడు. రాతి గుహలోనే కళలకు ప్రసవం జరిగిందని అంటాడు. అలా మొదలైన రాళ్లు అనే కవిత జీవితంలోని అనేక పార్శ్వాలను తడుముతుంది. చీమలు, గాయం చుట్టూ, మార్మికం ఇలా అనేక కవితల్లో కవి చేసిన దర్శనం మనకు కొత్తగా అనిపిస్తుంది. సాధారణవైపు నుంచి కాక అసాధారణ వైపుగా కవితల్ని నిర్వహిస్తున్నాడు. అకారణంగా అనవసరంగా జైలు శిక్ష అనుభవిస్తున్న మానవ హక్కుల కార్యకర్తల గురించి, అక్రమ అరెస్టుల నేపథ్యంలో రాసిన కవిత జైలుగీతం. అయితే ఎక్కడాఎవరు పేర్లు ఉండవు. కానీ కవిత చదువుతున్నంతసేపు వాళ్లే మనకు గుర్తుకొస్తుంటారు. దోషులందరూ జైల్లోనే ఉండాలని, అలా అయితే లోకమే పెద్దజైలని, ఎందుకంటే దోషులు ఎక్కువగా బయటే ఉన్నారని అంటాడు.
”కేడీలకు బేడీలు వేయాల్సి వస్తే ,ఆత్మను మోసగించుకునే ప్రతొకడూ కేడినే/ వాళ్ళ కారాగారం పేరు పశ్చాత్తాపమే/ కాల సాక్ష్యాన్ని ఎవరు చెరిపేయగలరు/ చట్టాల ముందు కన్నా ఒక్క కాలం ముందు/ దొంగలందరూ దొంగలే నేరగాళ్లందరూ నేరగాళ్లే” అనడం ద్వారా పాలకులు, అధికారులు లోపలకి చూసుకోవాల్సిన అవసరం గురించి చెప్పాడు. బహుజన జీవితాలను, బహుళ తాత్విక దృక్పథాన్ని కవి ఆవిష్కరించడం ఇందులో మరో కోణంగా కనిపిస్తుంది. పల్లె జీవితం తెలిసినవాడు. బహుజన బతుకుల్లో మెలిగినవాడు, స్వయంగా వృత్తి అనుభవాలు, వ్యథలు వున్నవాడు. బహుజన కులాల సంగమాన్ని కోరుకుంటున్నాడు. రాజ్యాధికారం వైపు బహుజనుల్ని అప్డేట్‌ కమ్మని పిలుపునిస్తున్నాడు. మనకు బాగా తెలిసిన పదాల్లోని ఒక్క అక్షరాన్ని తీసేసి, మరో కొత్త అక్షరాన్ని పెట్టడం ద్వారా ఓ కొత్త అర్ధాన్ని స్ఫురింప చేసే టెక్నిక్‌ కూడా ఇతనిలో బలంగా ఉంది. అలాంటిదే బతుకమ్మల్ని ఉతుకమ్మలు చేయడం. తన సొంత జీవిత సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన కవిత ఉతుకమ్మలు.
కుమ్మరి కుంటలోనుంచీ, గీత కత్తి చివర్ల నుంచి, ఉప్పరి గోతుల నుంచి, కంసాలి కుంపటి వెలుగుల నుంచి, చిత్రిక పట్టే వడ్రంగి చేతుల నుంచి, వాక్యాలను తెచ్చుకొని ఊరు ఊరంతా బహుజనల పునాది మీద నిలబడిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. పొట్టకూటికి కూడా మిగలరని వృత్తులన్నీ ఏకమై ”ఒకరు ఒకరుగా మిగిలిపోవడమే తీసివేత/ఒకరు ఇంకొకరుగా మారిపోవడమే కూడిక” అంటూ బహు జనాన్ని ఏకమవుదామంటున్నాడు. శ్రమ పాటల్లో ఉండే చెమట చరణాలను చెవి ఒగ్గి వినలంటాడు. యుద్ధాల గురించి చెబుతూ అక్కడ కూడా బహుజన పనిముట్లను చక్కగా వాడుకున్నాడు. ముగింపు వాక్యాలలో… ”రక్త సముద్రంలో దొరికిన అమృతం/ కళింగ ప్రదేశం/ అక్కడ ఖడ్గాల్లోంచి కరుణపుట్టింది/ అక్కడ పనిముట్టు/ హృదయాన్ని కొత్తవేకువగా మార్చేసింది/ నాకు దొరికిన పనిముట్టు కలం/ దాంతో నేను నిత్యం/ ప్రేమ మనిషి బొమ్మ చెక్కుతున్నాను” అనడం ద్వారా తన మార్గమేంటో కవి తెలుపుతున్నాడు. జీవితం జీవిస్తున్న వాళ్లు జీవితం మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి వాక్యాలు ఇవ్వగలరు.
”జీవిత సంద్రపు అల్లకల్లోలంలోంచి/ భద్రంగా ఆవల తీరానికి చేర్చే లైట్‌ హౌస్‌/ ఎప్పుడూ, ఎప్పటికీ కవిత్వమే/ సమాధి అయిన తర్వాత/ జీవితాన్ని హైకు సీతాకోకచిలుకలై/ ఈ నేలకు వినిపించేది కవిత్వమే”… కవిత్వాన్ని ఆరని దీపంగా భావిస్తూ, నిత్యం కవితమై మనల్ని పలకరించే మెట్టా 24 గంటలు కవిత్వంగా బతుకుతున్నాడు. మనిషిని ప్రకృతికమంటున్నాడు. మనిషిని పసిబిడ్డ కావాలంటున్నాడు. మనిషిలో ఉన్న సాంస్కృతిక సమైక్యతను కోరుకుంటున్నాడు. మనిషి ఒక నిరాడంబర జీవితం గడుపుతూ, జీవిత రహస్యాలను తెలుసుకుంటూ ఆనందంగా బతకాలని, ఆత్మను శుభ్రం చేసుకోవాల్సిన అవసరాన్ని గురించి సూఫీగా పాడుతున్నాడు. విశాలమైన ఛాతీతో తలెత్తుకునే విశ్వమానవుణ్ణి స్వప్నిస్తున్నాడు.
”ఎవరి అస్తిత్వాన్ని వాళ్లే బలంగా నోళ్లేత్తుతారు/ కండగలిగిన వారందరూ యుద్ధం చేయలేరు/ చీమలు కూడా ఒకసారి వాటి కొండేల మీద నిలబడి/ విజయదుందుభి మోగించగలవు”.
చీకటి పూట చీకటేకాదు పాలపుంతలు ఉంటాయి. ఇలాంటి వాక్యాలు అతను జీవితాన్ని ఎలా చూస్తున్నాడో, మనము ఎలా చూడాలో తెలుపుతాయి. స్త్రీనాన్న, వాగు, తెల్లంగీ మా కల, యుద్ధమూ-పిల్లలు చాలా మంచి కవితలు. మెట్టా వాక్యం సాధారణంగా ఉంటూనే మెలిపెడుతుంది. ఇప్పుడు తాత్వికత కూడా యాడ్‌ ఐయింది. నేను కొన్ని సూఫీ సమయాలు, తన గత కవిత సంపుటికన్నా పరిణతితో సాగింది. ఊహలు బాగున్నాయి. మెట్టా ఒక కవిత్వపు చలివేంద్రం. అయితే ప్రతి విషయాన్ని కవిత్వం చేయడంలో కూడా కొంత తడబాటు ఉంటుంది. తన కవిత ద్వారా తనకు తెలిసిన విషయం అంతా చెప్పేయాలని తపన కూడా ఉంది. మూడు నాలుగు వాక్యాలతో రాసిన చిట్టికవనాలు, పాపాయి లోకాలు, ప్రపంచకాలు ఇవి కూడా కవితా సంపుటి స్థాయిని పెంచాయి. సాంద్రవాక్యాలు, మనసుపెట్టెలో దాచుకోదగ్గ వాక్యాలున్నాయి. ఇప్పుడు మెట్టా సూఫీ సమయాలు, నా కవిత్వసమయాలుగా మారిపోయాయి. విశ్వమంత కవికన్ను మెట్టాకు నిండుగా అభినందనలు.
– డా|| సుంకర గోపాల్‌, 9492638547

Spread the love