భారతీయ ఆంగ్ల బాల సాహిత్యంలో హైదరాబాదీ సంతకం

In Indian English Children's Literature Hyderabadi signatureభారతీయ ఆంగ్ల బాల సాహిత్యమనగానే గుర్తొచ్చే పేర్లు రస్కిన్‌ బాండ్‌, పారో ఆనంద్‌, సుభద్రా సేన్‌గుప్తా, అరూప్‌ కుమార్‌ దత్తా, అనూ కుమార్‌ మన పిల్లల అభిమాన రచయితలు. ఆర్‌ కె నారాయణ్‌, రూపా పారు, సుధామూర్తి, అనుష్క రవిశంకర్‌, శోభా విశ్వనాథ్‌, కామాక్షి బాలసుబ్రహ్మణ్యం వంటి అనేక మంది దక్షణాది రచయితలు సైతం తారల్లా బాల సాహిత్యాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్నారు. ఈ కోవలోనే దాక్ష్షిణాత్య భారతీయ ఆంగ్ల బాల సాహిత్యకాశంలో కనిపించే గోల్కొండ మినార్‌ లాంటి బాల సాహితీవేత్త ‘రమేంద్ర కుమార్‌’.
‘రమేంద్ర కుమార్‌’ భారతీయ ఆంగ్ల బాల సాహిత్యంలో పరిచయం అక్కరలేని పేరే కాదు, ఆంగ్ల బాల సాహిత్య చదువరులందరికీ బాగా తెలిసిన పేరు. అందులోనూ మన పిల్లలకు అతి దగ్గరైన పేరు. వివిధ ప్రచురణ సంస్థల ద్వారా దశాబ్దాల కాలంగా బాలల కోసం సృజన చేస్తున్న సృజనకారుడు. రవేంద్ర కుమార్‌ అచ్చంగా హైదరాబాదీ. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన రమేంద్ర కుమార్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్నారు. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌, ఎంబిఎ చదివి స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో జనరల్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. మనకు తెలిసిన రచయిత రమేంద్ర కుమార్‌ వేరు… క్యాన్సర్‌ వారియర్‌గా దానిని జయించి నిలిచిన రమేంద్ర కుమార్‌ వేరు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ హిందీ ఆచార్యులు డా. ఆర్‌.కె. ఖండేల్‌వాల్‌, ప్రసిద్ధ హిందీ కథా, నవలా రచయిత్రి దీప్తి ఖండేల్‌వాల్‌ వీరి అమ్మానాన్నలు. ప్రస్తుతం విశ్రాంత, రచనా జీవితాన్ని గడుపుతున్న రమేంద్ర కుమార్‌ బెంగుళూరులో నివాసముంటున్నారు.
బాల సాహిత్యకారులుగా ప్రసిద్ధులైన రమేంద్ర కుమార్‌ అన్ని వయసుల వారికోసం రాశాడు. ‘రమేన్‌’గా తెలిసిన రమేంద్ర కుమార్‌ వ్యంగ్య కవి, కథా రచయిత, బాల సాహితీవేత్త. 1997 నుండి బాలల కోసం రాస్తున్న రమేంద్ర కుమార్‌ రచనలను పెంగ్విన్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా, డక్‌బిల్‌ హచెట్టె, చిల్డ్రన్‌ బుక్‌ ట్రస్ట్‌, ప్రథమ్‌, మహల్‌, వికాస్‌, రూపా Ê కో., నవ్‌నీత్‌, రోడోమేనియా వంటి అనేక ప్రసిద్ధ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. ‘చికెన్‌ సూప్‌ ఫర్‌ ది సోల్‌’ శీర్షికన వీరి రచనలు అచ్చయ్యాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును, ప్రశంసలను పొందిన రమేంద్ర కుమార్‌ రచనలు ఐ.సి.ఎస్‌.ఈ, సి.బి.ఎస్‌.ఇ పుస్తకాల్లో పాఠాలుగా పొందుపరచబడ్డాయి. ఒక కథ జపాన్‌ సంప్రదాయ కథలు చెప్పే పద్ధతైన ‘కమిషిబాయి’కి ఎంపికకావడం సాధారణమైన గుర్తింపేమీ కాదు. భారతదేశంలోని బోర్డుల్లోనే కాక విదేశాల్లోని పలు పాఠశాలల బోర్డుల్లో వీరి కథలుండడం విశేషం. బాలల కోసం తపస్సుగా రచనలు చేసే రమేంద్ర కుమార్‌ పిల్లల కోసం ముప్పై అయిదు పుస్తకాలు రాశారు. పదిహేను భాషల్లోకి అనువాదం కాగా, మరో పద్నాలుగు ఇతర భాషల్లోకి వెళ్ళాయి. రచయితగా వీరి తొలి పుస్తకం ‘మోహిని’ ఆవిష్కరణ జరిగిన వారం రోజుల్లోనే ప్రతులన్నీ అయిపోవడవం ఈ పుస్తకం విశేషం. తొలి నాన్‌ ఫిక్షన్‌ ‘ఎఫెక్టివ్‌ పేరెంటింగ్‌ : ఎ న్యూ పారాడిగమ్‌’ అశేష పాఠకుల ఆదరణను పొందింది. రమేన్‌ యాత్రా చరిత్రకారులుగా కూడా బాగా పరిచితుడు.
ఆరు నుండి పది సంవత్సరాల పిల్లల కోసం రమేన్‌ రాసిన రచనలు ఆలోచనాత్మకాలుగానే కాక పిల్లలకు ఆనందాన్ని సైతం అందిస్తాయి. ఆ కోవలో నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ కోసం రాసిన ‘బూంద్‌’, ‘ది రాయల్‌ స్వీపర్‌’, ఎ టేల్‌ ఆఫ్‌ టేల్స్‌’ మొదలగు కథలను ‘నీటిచుక్క’-‘సేవకుడైన రాజు’, ‘తోకల కథ’ పేర్లతో డా.పత్తిపాక మోహన్‌ తెలుగులోకి అనువాదం చేయగా ‘ది కాక్టస్‌’ను ‘నాగజెముడు’గా ఎం.నారాయణశర్మ అనువదించారు. మరో కథ ‘బెటర్‌దెన్‌ ది బెస్ట్‌’ కథ ‘గురువును మించిన శిష్యుడు’గా తూఫ్రాన్‌ సంపత్‌ కుమార్‌ తెలుగు చేశారు. మరో మంచి కథ ‘వి ఆర్‌ డిఫరెంట్‌’. దీనిని సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత చైతన్య పింగళి ‘స్నేహబంధం’గా పిల్లల కోసం అదించింది. ఇంతకు ముందే చెప్పినట్టు రమేన్‌ కథలు పిల్లలను ఆకర్షించడమేకాక ఆనందపరుస్తాయి కూడా! ‘తోకల కథ’ వివిధ జంతువుల తోకల గురించిన చిన్న పుస్తకం. ఎలుక, పిల్లి మొదలు సమీపంలోని అన్ని జంతువుల తోకల గురించి ఇందులో మనం చదవచ్చు. ఒక సాధారణ అంశాన్ని ఎంత సులభంగా చెప్పొచ్చో రమేంద్రకు తెలిసినంతగా ఇతరులకు తెలియదని చెప్పొచ్చు. బూంద్‌ అటువంటి కథే. చైతన్య అనువాదం చేసిన ‘వి ఆర్‌ డిఫరెంట్‌’ పిల్లలందరూ చదవాల్సిన కథ. ఒక అడవిలో ఒక కుందేలు, ఒంటె నేస్తాలు. కొంత కాలం తర్వాత మరో కుందేలు ఆ అడవికి వస్తుంది. కుందేలు, ఒంటెల మధ్య స్నేహం ఏమిటని, రెండింటి జాతులు వేరువేరని విడదీసే ప్రయత్నం చేస్తుంది. అయితే కుందేలు, ఒంటెల మధ్య ఎలా స్నేహబంధం గట్టిగా నిలిచిపోయిందో ఈ కథ చక్కగా చెబుతుంది.
హాస్య కథలు, జానపద కథలు, ఫాంటసీలు, వాస్తవ సంఘటనల కథా రూపాలు, ఆటల కథలు, హర్రర్‌ కథలు, జీవిత చరిత్రలు మొదలుకుని ఫోక్సో చట్టం, జువైనల్‌ యాక్ట్‌ ఆధారంగా గ్రాఫిక్‌ కథలు, ఇతర రచనలు, నవలను సైతం రాశారు రమేంద్ర కుమార్‌. రమేంద్ర కుమార్‌ రచనలన్నీ కేవలం బాలల బాధలు, సమస్యలను ఏకరువు పెట్టి ఊరుకోవు. రచనలన్నీ పరిపూర్ణమైన వికాసం, ఆనందాల గురించి చర్చిస్తాయి, దారి చూపిస్తాయి, ఆలోచింపజేస్తాయి. అంతేకాదు, తన రచనలను కేవలం బోధనలుగా, నీతుల గీతలుగా ఎప్పుడూ మలచలేదు రమేన్‌. ఒక్కో రచన ఒక్కో అంశాన్ని, లేదా సంఘటనను మన కళ్ళ ముందు ఉంచుతుంది. అనేక రచనల్లో వివిధ అంశాలు రమేన్‌ స్పృశించినప్పటికీ ఆనందం, వినోదం, హాస్యం పిల్లలకు ప్రధానమని నమ్మి రచనలు చేశారు. వీరి రచనలన్నీ అత్యంత ఆదరణ పోందడమే కాక కొన్ని రచనలు ఐదారు లక్షల ప్రతులకుపైగా అమ్ముడుపోవడం ఆయన రచనల పట్లగల ఆకర్షణన, ఆదరణను తెలుపుతోంది.
‘జస్ట్‌ ఎ సెకండ్‌ అండ్‌ అధర్‌ స్టోరీస్‌’ 1997లో అచ్చయ్యింది. ‘ద మ్యాసిక్‌ పిల్స్‌ అండ్‌ అధర్‌ స్టోరీస్‌’, ‘ద విల్‌ టూ విన్‌’ సంపుటాలను వికాస్‌ ప్రచురించింది. ఇంకా ‘ది మ్యాడ్‌ సైంటిస్ట్‌ అండ్‌ అధర్‌ స్టోరీస్‌’, ‘చెక్‌ అండ్‌ మేట్‌ అండ్‌ అధర్‌ స్టోరీస్‌’, ‘ది మిరాకిల్‌ పార్క్‌’ పుస్తకాలు ఎక్కువగా ఖ్యాతి గాంచిన రచనల్లో కొన్ని. ఇవేకాక ‘ది బ్రేవ్‌ ఫ్రెండ్స్‌ అండ్‌ అదర్‌ స్టోరీస్‌, టెర్రర్‌ ఇన్‌ ఫన్నీ సిటి, నౌ ఆర్‌ నెవర్‌, బ్రేవ్‌ నిర్మల్‌, మోహినీ, ది పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌, ఎ సునామి కాల్డ్‌ నాని’ వంటి పుస్తకాలు రచయితగానే కాక వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మనకు కనిపిస్తారు. జువైనల్‌ ఆక్ట్‌ నేపథ్యంలో వ్రాసిన పుస్తకం ‘జువైనల్‌ జస్టిస్‌ ఆక్ట్‌’ గ్రాఫిక్‌ పుస్తకం 2010లో ఢిల్లీకి చెందిన బట్టర్‌ఫ్లై తీసుకువచ్చిది. వీళ్ళకోసం రాసిన మరో అవగాహన రచనా ‘వాట్‌, వై అండ్‌ హౌ – ఎ గ్రాఫిక్‌ బుక్‌ ఆన్‌ డయాబిటిస్‌’.
రచయితగా రమేంద్ర కుమార్‌ దేశ విదేశాలలో జరిగిన అనేక జాతీయ అంతార్జాతీయ సదస్సుల్లో, సమావేశాల్లో పాల్గొన్నారు. వాటిలో షార్జా చిల్డ్రన్స్‌ రీడింగ్‌ ఫెస్టివల్‌, జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌, హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌, భువనేశ్వర్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ స్టోరీటెల్లింగ్‌, చండీగర్‌ చిల్డ్రన్స్‌ లిటరరీ ఫెస్టివల్‌ మొదలైనవి ఉన్నాయి. ఇవేకాక సాహిత్య అకాడమి, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌, ఇండియా, ఇందిరా గాంధీó నేషనల్‌ ఓపెన్‌ యునివర్సిటి వంటి జాతీయ సంస్థల కార్యశాలలు, సదస్సులోనూ పత్రసమర్పణ చేశారు. 2008లో డెన్మార్క్‌లో జరిగిన 31వ ప్రపంచ ప్రచురణ కర్తల ఐ.బి.బి.వై వరల్డ్‌ కాంగ్రెస్‌లో పాల్గొని రెండు సదస్సులకు అధ్యక్షత వహించారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, రమేన్‌ రచన నార్వే దేశపు తొమ్మిదవ గ్రేడ్‌ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఎంపికైంది. మన దేశంలోనూ వీరి రచనలు ఆరింటిని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వివిధ స్థాయిల్లో పాఠ్యాంశాలుగా ఎంపికచేసింది. రమేన్‌ రీడ్‌ ఎలౌడ్‌ పుస్తకం ‘పప్లూ ది జెయింట్‌’కు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా అరుదైన గౌరవం లభించింది. సెప్టెంబర్‌ 7, 2013న ఈ కథ భారతదేశంతో పాటు పలు విదేశాల్లో 22 భాషల్లో, 27 రాష్ట్రాల్లో కథ చెప్పడంలో భాగంగా నిలిచింది.
రచయితగా పలు సత్కారాలు, గౌరవాలు అందుకున్న రమేంద్ర కుమార్‌ 2016లో చిల్డ్రన్స్‌ బుక్‌ ట్రస్ట్‌ నిర్వహించిన పోటీలో బహుమతిని గెలుచుకున్నాడు. అంతేకాదు, 2027లో శ్రీలంకలో జరిగిన రచయితలు, ప్రచురణకర్తల సదస్సులో బాల సాహిత్య రచన, సేవలకు గుర్తింపుగా విశేష గౌరవ సత్కారం అందుకున్నారు. మార్చి 2020లో పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వారి ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ సత్కారాన్ని అందుకున్నారు. 2022 సంవత్సరానికి గాను లండన్‌లోని ‘టాకింగ్‌ స్టోరీస్‌’ రమేంద్ర కుమార్‌ను ‘ఆథర్‌ ఆంట్‌ స్టోరీ టెల్లర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా గౌరవించి సత్కరించింది. ఈ సందర్భంగా ఇవాళ్ల బెంగుళూరులో దక్షిణాత్య ఆంగ్ల బాల సాహిత్యకారుడు, ‘రమేన్‌’ సాహిత్యంపైన ‘రమేంద్ర కుమార్స్‌ యునిక్‌ చిల్డ్రన్స్‌ వరల్డ్‌’ పేర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఆంగ్ల బాల సాహిత్యంలో అచ్చమైన హైదరాబాదీ సంతకానికి దిల్‌సే ముబార్‌బాద్‌!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love